UGC NET Exam Date : ‘యూజీసీ-నెట్’ రీఎగ్జామినేషన్ షెడ్యూల్ విడుదల

by Hajipasha |
UGC NET Exam Date : ‘యూజీసీ-నెట్’ రీఎగ్జామినేషన్ షెడ్యూల్ విడుదల
X

దిశ, నేషనల్ బ్యూరో : యూజీసీ - నెట్ 2024 రీఎగ్జామినేషన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. దీని ప్రకారం.. ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 4 వరకు యూజీసీ నెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ కంప్యూటర్ బేస్డ్ (సీబీటీ) పరీక్ష దేశంలోని ప్రధాన నగరాల్లో ఆగస్టు 21, 22, 23, 26, 28, 29, 30, సెప్టెంబర్‌ 2, 3, 4 తేదీల్లో జరగనుంది. ఎగ్జామ్ తేదీకి 10 రోజుల ముందు అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రం వివరాలను ‘యూజీసీనెట్.ఎన్‌టీఏ.ఏసీ.ఐఎన్’ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని ఎన్‌టీఏ తెలిపింది. తాము ప్రకటించిన తేదీల్లో రోజూ రెండు షిఫ్టులలో ఎగ్జామ్ జరుగుతుందని.. మూడు గంటల పాటు పరీక్ష ఉంటుందని వెల్లడించింది. పరీక్ష మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే హెల్ప్ లైన్ నంబర్ 011-40759000, ఈమెయిల్ ఐడీ [email protected] ద్వారా ఎన్‌టీఏను సంప్రదించవచ్చు.

జూన్ 19న పరీక్ష రద్దు కావడంతో..

వాస్తవానికి జూన్ 18వ తేదీనే యూజీసీ-నెట్ పరీక్ష జరిగింది. అయితే పరీక్షలో అవకతవకలు జరిగాయనే సమాచారం అందడంతో జూన్ 19న దాన్ని కేంద్ర విద్యాశాఖ రద్దు చేసింది. అందుకే ఇప్పుడు యూజీసీ-నెట్ రీఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నారు. మొత్తం 83 సబ్జెక్టులలో జూనియర్‌ రీసెర్చ్ ఫెలోషిప్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తుంటారు. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు. యూజీసీ-నెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలివే..

తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలోని హైదరాబాద్, సికింద్రాబాద్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, అమరావతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలలో యూజీసీ నెట్ పరీక్షా కేంద్రాలు ఉంటాయి.

Next Story

Most Viewed