జలంధర్‌ లోక్ సభ ఆప్ కైవసం

by Javid Pasha |   ( Updated:2023-05-13 14:16:12.0  )
జలంధర్‌ లోక్ సభ ఆప్ కైవసం
X

లఖ్ నవూ : వేర్వేరు కారణాలతో మేఘాలయ(సోహియాంగ్), ఉత్తరప్రదేశ్‌ (ఛన్‌బే), ఒడిశా(ఝార్సుగూడ)లోని చెరో అసెంబ్లీ స్థానానికి, పంజాబ్‌ లోని జలంధర్‌ లోక్ సభ స్థానానికి మే 10న జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా శనివారం రిలీజ్ అయ్యాయి. కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న జలంధర్‌ లోక్‌సభ స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించింది. సుమారు గత 24 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి పట్టు ఉన్న జలంధర్‌ స్థానంలో.. తాజాగా జరిగిన ఉప ఎన్నికలో ఆప్‌ అభ్యర్థి సుశీల్‌ కుమార్‌ రింకూ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ అభ్యర్థి కరమ్‌ జీత్‌ కౌర్‌ పై 58 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రింకూకు 3,02,097ఓట్లు పోలవగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 2,43,450 ఓట్లు వచ్చాయి. శిరోమణి అకాలీదళ్‌ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి 1,58,354 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా.. 1,34,706 ఓట్లతో బీజేపీ అభ్యర్థి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు.

ఒడిశాలో..

ఒడిశాలోని ఝార్సుగూడ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. బీజేడీ అభ్యర్థి దీపాలీ దాస్‌ ఘన విజయం సాధించారు. సమీప అభ్యర్థి బీజేపీకి చెందిన తన్కదార్‌ త్రిపాఠీ పై 48 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి తరుణ్‌ పాండే కేవలం 4,496 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. దీపాలీ దాస్‌ తండ్రి నబా కిషోర్‌ దాస్‌ ఈ ఏడాది జనవరిలో ఓ పోలీస్‌ ఆఫీసర్‌ జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ఝార్సుగూడ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.

మేఘాలయలో..

మేఘాలయలోని సోహియాంగ్ అసెంబ్లీ స్థానంలో యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) అభ్యర్థి సిన్‌షార్ కుపర్ రాయ్ లింగ్‌డో థాబా 3,400పైగా ఓట్ల తేడాతో ఎన్‌పీపీ అభ్యర్థిని ఓడించారు. లింగ్‌డో థాబా మొత్తం 16,679 ఓట్లు పొందారు. ఫిబ్రవరి 27న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు UDP అభ్యర్థి హెచ్‌డిఆర్ లింగ్డో మృతి చెందడంతో ఓటింగ్ వాయిదా పడినందున మే 10న ఎన్నికలు జరిగాయి.

ఉత్తరప్రదేశ్‌ లో..

ఉత్తరప్రదేశ్‌ మీర్జాపూర్ జిల్లాలోని ఛన్‌బే అసెంబ్లీ స్థానంలో బీజేపీ మిత్రపక్షం అప్నా దళ్ (సోనీలాల్).. సమాజ్‌వాదీ పార్టీ కంటే ముందంజలో ఉంది. ఛాన్‌బే నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన కీర్తి కోల్, అప్నా దళ్ (సోనేలాల్) పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాహుల్ ప్రకాష్ కోల్ భార్య రింకీ కోల్ మధ్య ద్విముఖ పోరు నడుస్తోంది.

ఇవి కూడా చదవండి:

కర్ణాటక ఎన్నికల్లో 92 ఏళ్ల వృద్ధుడు రికార్డ్.. వరుసగా నాలుగోసారి విజయం

Advertisement

Next Story

Most Viewed