ఆ బిల్లును వెంటనే రద్దు చేయాలి..కర్ణాటక ప్రభుత్వంపై పారిశ్రామిక వేత్తల ఫైర్

by vinod kumar |   ( Updated:2024-07-17 14:13:10.0  )
ఆ బిల్లును వెంటనే రద్దు చేయాలి..కర్ణాటక ప్రభుత్వంపై పారిశ్రామిక వేత్తల ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయివేట్ సంస్థల్లో గ్రూప్‌ సీ,గ్రూప్‌ డీ పోస్టుల్లో కన్నడ ప్రజలకు100 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన మంత్రి వర్గ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ‘అన్ని ప్రయివేట్ సంస్థల్లో 100 శాతం కన్నడిగుల నియమకాన్ని తప్పనిసరి చేసే బిల్లును కేబినెట్ ఆమోదించింది. కన్నడ ప్రజలు మంచి జీవితాన్ని గడపడానికి అవకాశం కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. వారికి అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం. మాది కన్నడిగుల అనుకూల ప్రభుత్వం. వారి సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ బిల్లును గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ బిల్లు ప్రకారం..ఏదైనా పరిశ్రమ, కర్మాగారం లేదా ఇతర సంస్థల్లో మేనేజ్‌మెంట్ కేటగిరీలో 50 శాతం స్థానిక అభ్యర్థులను, నాన్ మేనేజ్‌మెంట్ కేటగిరీలలో 70 శాతం మందిని నియమించాల్సి ఉంటుంది. దీనిని పర్యవేక్షించేందుకు గాను ప్రభుత్వం ఓ అధికారిని సైతం నియమిస్తుంది.

అయితే ఈ బిల్లును పలువురు పారిశ్రామిక వేత్తలు వ్యతిరేకించారు. ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ టీవీ మోహన్‌దాస్ పాయ్ ఈ బిల్లును నియంతృత్వం లాంటిదని అభివర్ణించారు. దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఫార్మా కంపెనీ బయోకాన్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా, అసోంచామ్ కర్ణాటక కో చైర్మన్ ఆర్ కే మిశ్రాతో పాటు రాష్ట్రంలోని పలువురు దీనిని వ్యతిరేకించారు. ఇది వివక్షతో కూడుకున్నదని, దీని వల్ల టెక్ పరిశ్రమ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య తన పోస్టును తొలగించారు. అలాగే ఈ బిల్లుపై పారిశ్రామికవేత్తలు తమ భయాందోళనలను వ్యక్తం చేయడంతో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. పరిశ్రమల ప్రయోజనాలతో పాటు కన్నడిగుల సంక్షేమాన్ని పరిరక్షించడానికి విస్తృత సంప్రదింపులు జరుపుతామని చెప్పారు.

రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోయే అవకాశం: నాస్కామ్

కర్ణాటకలో ప్రయివేటు సంస్థల ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ తప్పనిసరి చేసే బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలపడంతో సాఫ్ట్‌వేర్ బాడీ నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య కారణంగా రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోయే అవకాశం ఉందని పేర్కొంంది. దానిని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.బిల్లులోని నిబంధనలు కంపెనీలను, స్టార్టప్‌లను తరిమికొట్టేలా ఉన్నాయని, ముఖ్యంగా మరిన్ని ప్రపంచ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న సమయంలో అవి తమ పెట్టుబడి ప్రాంతాలను మార్చుకుంటాయని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటీ రంగంతో పాటు ఇతర రంగాల్లో అభివృద్ధి నిలిచిపోతుందని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed