Terrar attack: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి.. సీఆర్‌పీఎఫ్ అధికారి మృతి

by vinod kumar |
Terrar attack: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి.. సీఆర్‌పీఎఫ్ అధికారి మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లో మరో ఉగ్రదాడి జరిగింది. ఉదంపూర్‌ జిల్లాలోని బసంత్‌గఢ్‌ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తు్న్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) జవాన్ల బృందంపై టెర్రరిస్టులు దాడి చేశారు. ఈ క్రమంలో సీఆర్‌పీఎఫ్ 187వ బెటాలియన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్‌ కుల్‌దీప్‌సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగానే పరిస్థితి విషమించి ఆయన కన్ను మూశారు. సాధారణ సోదాల్లో భాగంగా సోమవారం జవాన్లు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ్డట్టు అధికారులు తెలిపారు. ఘటన అనంతరం అప్రమత్తమైన సీఆర్‌పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్త బృందం సెర్చ్ ఆపరేషన్‌ ప్రారంభించింది.

దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. జాయింట్ పెట్రోలింగ్ పార్టీ ప్రతీకారంగా ఎదురు కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. అయితే జమ్మూ ప్రాంతంలో ఈ అటాక్ జరగడం గమనార్హం. ఎందుకంటే కశ్మీర్‌తో పోలిస్తే కొన్నేళ్లుగా ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంది. కాగా, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలోనే ఉగ్రదాడి జరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో జమ్మూ కశ్మీర్‌లో పోలింగ్ జరగనుంది. దాదాపు 70,000 మంది సిబ్బందిని ఇప్పటికే కశ్మీర్ లో మోహరించారు.

Advertisement

Next Story

Most Viewed