Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల కేసులో సుప్రీం సంచలన తీర్పు

by Shamantha N |
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల కేసులో సుప్రీం సంచలన తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎలక్టోరల్‌ బాండ్ల(Electoral Bonds)పై కోర్టు పర్యవేక్షణలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారంలో క్విడ్‌ ప్రో కో జరిగి ఉండవచ్చనే ఆరోపణలు వచ్చాయి. అయితే, వాటిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని కోరుతూ సుప్రీం కోర్టులో నాలుగు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు(PIL) దాఖలయ్యాయి. వీటిని పరిశీలించిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్థీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. సాధారణ చట్టం కింద సిట్ ఏర్పాటు చేయవచ్చన్న కోర్టు.. విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించడం సరైనదే అంది. అయితే, ఆర్టికల్ 32 ప్రకారం ఈ దశలో జోక్యం చేసుకోవడం కూడా తొందరపాటే అని తెలిపింది.

అది ఐటీ శాఖకు సంబంధించిన పని

సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సీజేఐ బెంచ్ విచారణ జరిపింది. రాజకీయ పార్టీలు, కార్పొరేట్‌ దాతల మధ్య క్విడ్‌ ప్రో కో జరిగిందంటూ పిటిషనర్లు ఆరోపించారు. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలను రికవరీ చేయడంతోపాటు, వాటి ఆదాయపన్ను మదింపులను తిరిగి తెరవాలని కోరారు. అయితే, ఆ దరఖాస్తుని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆదాయపు పన్ను చట్టం కింద ఇవి సంబంధిత శాఖ అధికారులు తీసుకోవాల్సిన చర్యలు అని పేర్కొంది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల (electoral bonds scheme) చెల్లుబాటుపై సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో సంచలన తీర్పు వెలువరించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. కాగా.. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సిట్ ఏర్పాటునకు నిరాకరించింది.

Advertisement

Next Story