ఎస్పీ నేతకు 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ.14 లక్షల జరిమానా

by Harish |   ( Updated:2024-05-30 14:33:02.0  )
ఎస్పీ నేతకు 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ.14 లక్షల జరిమానా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎస్పీ ప్రభుత్వ హయాంలో దుంగార్‌పూర్ కాలనీ నివాసితులను కొట్టి, బలవంతంగా వారిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించడం, వారిపై దోపిడీ, బెదిరింపులకు పాల్పడటం వంటి ఆరోపణలకు సంబంధించిన కేసులో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజం ఖాన్‌కు రాంపూర్ కోర్టు గురువారం 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.14 లక్షల జరిమానా విధించింది. నేరపూరిత అతిక్రమణ, ఉద్దేశపూర్వకంగా అవమానపరచడం, బెదిరించడం, నష్టం కలిగించే అల్లర్లు సహా భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద ఆజం ఖాన్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈయనతో పాటు రాంపూర్ మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ అజహర్ అహ్మద్ ఖాన్, మాజీ సర్కిల్ ఆఫీసర్ ఆలే హసన్‌తో సహా మరో ముగ్గురికి కూడా 5 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.2.5 లక్షల జరిమానా విధించారు.

ఈ కేసు 2016 నాటిది, ఆజం ఖాన్, అతని అనుచరులు ప్రభుత్వ ఆశ్రయాలను ఏర్పాటు చేయడానికి దుంగార్‌పూర్ కాలనీలో ఉంటున్న ప్రజలను అక్కడి నుంచి పంపించడానికి వారిని కొట్టి, బలవంతంగా వారి ఇళ్లను కూల్చివేశారు. అడ్డుగా వచ్చిన వారిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తరువాత ఈ ఘటనపై 2019లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అక్కడి స్థానికులు కూడా ఆజం ఖాన్‌, అతని అనుచరులు తమ ఇళ్లలోకి బలవంతంగా చొరబడి, దాడి చేసి, డబ్బు, వస్తువులను దోచుకున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా, ఇప్పుడు కోర్టు నిందితులకు శిక్ష ఖరారు చేసింది.

Advertisement

Next Story

Most Viewed