Siddaramaiah: న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంది.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

by vinod kumar |   ( Updated:2024-10-03 10:32:10.0  )
Siddaramaiah: న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంది.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: ముడా కుంభకోణం కేసులో విచారణను ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థపై తనకు విశ్వాసం ఉందని తెలిపారు. సత్యమే ఎప్పటికీ విజయం సాధిస్తుందన్నారు. గురువారం ఆయన మైసూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తాను ఏ తప్పూ చేయలేదని ఒక వేళ చేసి ఉంటే ఇంత కాలం రాజకీయాల్లో కొనసాగడం సాధ్యం కాదన్నారు. తాను, దేవెగౌడ ఒకే తాలూకు వాళ్లమని గతంలో కలిసి పనిచేశామని, ఎప్పటికనా సత్యమే గెలుస్తుందని నొక్కి చెప్పారు. రాష్ట్రంలో మంచి పనులు చేస్తున్న నన్ను ప్రతి రోజూ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కోర్టు తీర్పులను ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని తెలిపారు. మనస్సాక్షికి అనుగుణంగా నడుచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.

సీఎంపై మరో ఫిర్యాదు

తన భార్యకు సంబంధించిన భూ కుంభకోణం కేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారంటూ సిద్ధరామయ్యపై తాజాగా మరో ఫిర్యాదు నమోదైంది. సీఎం కుమారుడు యతీంద్ర పేరు కూడా ఉన్న ఈ ఫిర్యాదును ముడా కేసులో ఫిర్యాదుదారుల్లో ఒకరైన ప్రదీప్ కుమార్ ఈడీ ఎదుట దాఖలు చేశారు. సాక్ష్యాలను తారుమారు చేయడంలో ముడా అధికారుల ప్రమేయం సైతం ఉందని ఆరోపించారు. సిద్ధరామయ్య భార్య బీఎన్ పార్వతి మైసూరులోని ప్రధాన ప్రాంతాల్లోని ప్లాట్లను తిరిగి ఇస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆరోపణలు రావడం గమనార్హం. ప్లాట్లను వెనక్కి తీసుకునేందుకు కూడా ముడా అంగీకరించింది.

Advertisement

Next Story

Most Viewed