CM : సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణలోకి రానీయకండి

by Kalyani |
CM : సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణలోకి రానీయకండి
X

దిశ,మేడ్చల్ బ్యూరో : సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలో కి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ గౌతం హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ధాన్యం కొనుగోలు, డిఎస్సీ నియామకాలు అయిన రెండు అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల ఐకేపీ సెంటర్లు ఉన్నాయని, అవసరమైన చోట కొత్త ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. రైతుల నుండి సన్నవడ్ల కొనుగోలు కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, సన్నవడ్ల కు రూ. 500 బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ఐకేపీ సెంటర్ల కి సీరియల్ నెంబర్లు ఇవ్వాలి,సన్నవడ్ల పై ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని సీఎం సూచించారు. గతంలో లాగా గోనె సంచుల కొరత రాకుండా, ముందుగానే గోనె సంచులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు లో వ్యవసాయ అధికారులను ఇన్వాల్వ్ చేస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. కొనుగోలు చేసిన ధ్యానం వెంటనే తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని, ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజు కలెక్టర్లు రెండు గంటలు ధాన్యం కొనుగోలు పైన సమీక్ష జరిపి, ఏదైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.

కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోళ్ల పైన కాల్ సెంటర్ ఏర్పాటు చేసి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసేవారిని సహించవద్దని, అవసరమైతే వారి పై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. రాష్ట్రంలో వంద శాతం రైతులు సన్నబియ్యం పండించేలా చొరవ చూపించాలని, వాతావరణ శాఖ నుంచి వచ్చే సూచనల ప్రకారం ఐకేపీ సెంటర్లలో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు.

డీఎస్సీ కి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 5 వ తేదీ లోగా పూర్తి చేసి, దసరా పండుగ ముందే డిఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. అక్టోబర్ 9 నియామక పత్రాలను అభ్యర్థులకు అందజేయాలని అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి డిసిపి సురేష్, అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి, డిఆర్ఓ హరిప్రియ, డీఈఓ విజయ కుమారి, వ్యవసాయ, పౌర సరఫరా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed