Atal Setu: అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకిన వ్యక్తి.. 2 రోజుల్లో ఇద్దరు ఆత్మహత్య

by S Gopi |
Atal Setu: అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకిన వ్యక్తి.. 2 రోజుల్లో ఇద్దరు ఆత్మహత్య
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని ముంబయిలో ఉన్న అటల్ సేతు బ్రిడ్జ్‌పై మరో ఆత్మహత్య ఘటన సంచలనం రేపుతోంది. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే అటల్‌ సేతు బ్రిడ్జిపై ఇటీవలే ఓ బ్యాంకు ఉద్యోగి సముద్రంలోకి దూకిన ఘటన మరువక ముందే రెండు రోజుల వ్యవధిలో అలాంటిదే మరో చేదు ఘటన చోటుచేసుకుంది. మాతుంగాకు చెందిన 52 ఏళ్ల వ్యాపారవేత్త అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. మరణించిన వ్యక్తి ఫిలిప్ హితేష్ షాగా గుర్తించినట్టు, అతను మాతుంగాలో నివశిస్తున్నాడని పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా షా డిప్రెషన్‌లో ఉన్నట్టు, ఆ కారణంగానే ఒత్తిడి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకోగా, ఫిలిప్ షా అటల్ సేతు బ్రిడ్జిపై తన సెడాన్ కారును ఆపి సముద్రంలోకి దూకాడు. ఈ ఘటన మొత్తం బ్రిడ్జికి సంబంధించి సీసీటీవీ కంట్రోల్ రూమ్ నుంచి సిబ్బంది గుర్తించారు. తక్షణం విషయాన్ని అధికారులకు తెలియజేయగా, రెస్క్యూ బృందం అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అతను సముద్రంలోకి దూకేశాడని పోలీసులు వివరించారు. ఆపరేషన్ ద్వారా కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, ఆసుపత్రికి తరలించే సమయానికి మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.

Advertisement

Next Story