Sonia Gandhi : ‘‘కశ్మీర్‌ను దేశం చేయాలనే సంస్థతో సోనియాకు సంబంధాలు’’ : బీజేపీ సంచలన ఆరోపణలు

by Hajipasha |
Sonia Gandhi : ‘‘కశ్మీర్‌ను దేశం చేయాలనే సంస్థతో సోనియాకు సంబంధాలు’’ : బీజేపీ సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ(Sonia Gandhi)పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది.అమెరికాకు చెందిన జార్జ్ సోరస్ ఫౌండేషన్(George Soros) నుంచి ఆర్థికసాయం పొందే ఎఫ్‌డీఎల్-ఏపీ ఫౌండేషన్‌తో ఆమెకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. భారత్‌కు చెందిన కశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా చేయాలనే భావజాలంతో ఎఫ్‌డీఎల్-ఏపీ ఫౌండేషన్‌ పనిచేస్తోందని కమలదళం పేర్కొంది. ఆదివారం ఈమేరకు ఎక్స్‌ వేదికగా బీజేపీ(BJP) సంచలన పోస్ట్ చేసింది. ‘‘కశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా చేయాలని వాదించే సంస్థతో సోనియాగాంధీకి సంబంధాలు ఉండటాన్ని బట్టి.. భారత అంతర్గత వ్యవహారాలపై విదేశీ సంస్థల ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాంటి సంస్థలతో ఉన్న సంబంధాల ప్రభావం రాజకీయాలపైనా ఉంటుంది’’ అని బీజేపీ ఆరోపించింది.

‘‘సోనియాగాంధీ ఛైర్మన్‌గా ఉన్న టైంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌.. జార్జ్ సోరస్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేసింది. భారత సంస్థలపై విదేశీ నిధుల ప్రభావాన్ని ఇలాంటి అంశాలు అద్దంపడతాయి’’ అని కమలదళం పేర్కొంది. ‘‘అమెరికా బిలియనీర్ జార్జ్ సోరస్ నుంచి నిధులు పొందే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించే సలీల్ శెట్టి.. రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు’’ అని బీజేపీ తెలిపింది. ‘‘అదానీపై విమర్శలు చేసేందుకు రాహుల్ గాంధీ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌ను జార్జ్ సోరస్‌ నుంచి నిధులు పొందే ఓ‌సీసీఆర్‌పీ(ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్) సంస్థ లైవ్ టెలికాస్ట్ చేసింది. దీన్నిబట్టి జార్జ్ సోరస్‌తో కాంగ్రెస్ పార్టీకి ఎంత బలమైన సంబంధాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జార్జ్ సోరస్ తన పాత మిత్రుడని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్వయంగా ఒప్పుకున్నారు’’ అని కమలదళం పేర్కొంది. భారతదేశ వికాసాన్ని అడ్డుకోవాలనేది జార్జ్ సోరస్, వాళ్లతో చేతులు కలిపిన వారి ఉమ్మడి లక్ష్యమని ఆరోపించింది.

Advertisement

Next Story

Most Viewed