రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 2.0 ఫిక్స్..? నేతలకు సోనియా గాంధీ కీలక ఆదేశం

by Satheesh |
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 2.0 ఫిక్స్..? నేతలకు సోనియా గాంధీ కీలక ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 2.0 అతి త్వరలో మొదలు కానున్నది. ఈస్ట్ నుంచి వెస్ట్ రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర జరగనున్నట్లు తెలిసింది. ఈ మేరకు పార్టీ కసరత్తు చేస్తున్నది. సీడబ్ల్యూసీ సమావేశాల్లోనూ సభ్యులంతా జోడో యాత్ర 2 చేయాల్సిన అవసరం ఉన్నదని కోరినట్లు సమాచారం. మెజార్టీ నేతల రిక్వెస్టు తో ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ సైతం భారత్ జోడో యాత్ర 2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

వెంటనే ప్రణాళిక తయారు చేయాలని ఏఐసీసీని ఆదేశించినట్లు తెలిసింది. పార్లమెంట్ సమావేశాలు అనంతరం జోడో యాత్ర 2 పై తనకు నివేదిక ఇవ్వాలని సోనియా ఏఐసీసీ నేతలను కోరినట్లు తెలిసింది. దీంతో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ నాయకుల్లో మరింత ఉత్సహం నెలకొన్నది. తమ రాష్ట్రం నుంచి మొదలు పెట్టాలని ఇప్పటికే పలువురు పీసీసీ లు సోనియా ముందు రిక్వెస్టులు పెడుతున్నారు.

ఫస్ట్ సక్సెస్ తోనే..?

రాహుల్ గాంధీ ఫస్ట్ జోడో యాత్ర సక్సెస్ అయింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జరిగిన ఈ జోడో యాత్ర అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నదనే అభిప్రాయం పార్టీలో ఉన్నది. నేరుగా రాహుల్ గాంధీ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగడం ప్రజలను సంబురానికి గురి చేసింది. దాదాపు నాలుగు వేల కిలో మీటర్లకు పైగా సాగిన ఈ యాత్రలో రాహుల్ పలు సమస్యలపై కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. తప్పిదాలను వెలికితీస్తూ సమాజానికి తెలియజేసేలా వివరించారు.

క్షేత్రస్థాయి ప్రజల సమస్యలను స్వయంగా రాహులే గుర్తించడంతో చాలా మంది ఆనందం వ్యక్తం చేశారు. ఇది పార్టీ మైలేజీ పెంచినట్లు ఆ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే రెండో విడత జోడో యాత్ర చేయాలని పార్టీ ప్రణాళికను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. ఏ రాష్ట్రం నుంచి చేస్తే బాగుంటుంది? ఎన్ని కి.లో మీటర్లు చేయాలి? ఎలాంటి సమస్యలను గుర్తించాలి? వంటి అంశాలను పార్టీ తరువుగా అధ్యయనం చేయనున్నది. ఓ ప్రత్యేకమైన రూట్ మ్యాప్‌తో జోడో యాత్ర 2.0 ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

అందరి నోటా జోడో యాత్ర..

సీడబ్ల్యూసీ సమావేశాలకు వచ్చిన నేతలందరూ జోడో యాత్రపైనే చర్చించారు. తాజ్ కృష్ణ హోటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జోడో యాత్ర ఫోటో ప్రదర్శనను పరిశీలించిన నేతలంతా రాహుల్‌పై ప్రశంసలు కురిపించారు. పార్టీకి హైప్ రావడానికి ఈ యాత్రే కారణమంటూ చర్చించుకున్నారు. దేశ వ్యాప్తంగా జోడో యాత్ర పార్టీ మైలేజీని పెంచిందని సీడబ్ల్యూసీ సమావేశాలకు వచ్చిన నేతలంతా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరోవైపు ఈ సమావేశాలకు భద్రత కొరకు వచ్చిన సెంట్రల్ ఫోర్స్ స్టాఫ్‌తో పాటు రాష్ట్ర పోలీసులూ జోడో యాత్ర ఫోటో ప్రదర్శనను చూసి ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story