యాదగిరి గుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం గుండా నరసింహుడి దర్శనం

by Naveena |   ( Updated:2025-01-09 15:42:41.0  )
యాదగిరి గుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం గుండా నరసింహుడి దర్శనం
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్టలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 5:30 గంటలకు స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సన్నద్ధమైంది. ఉదయం 2 గంటలకు ఆలయాన్ని తెరిచి 2గంటల నుండి 2.30 నిమిషాల వరకు సుప్రభాత సేవ నిర్వహిస్తారు. ఆ తర్వాత 2.30 నిమిషాల నుండి 3 గంటల వరకు ప్రాతఃకాల తిరువారాధనను నిర్వహిస్తారు. 3 గంటల నుంచి 3.30 నిమిషాల వరకు తిరుప్పావై సేవాకాలంగా పేర్కొన్నారు. ఆపై 3.30 నిమిషాల నుండి 4.15 నిమిషాల వరకు బాల భోగం ఆరగింపు నిర్వహిస్తారు. 4.15 నుంచి 5.15 గంటలకు స్వామివారి అలంకార సేవలు, 05.30 నుంచి 06.30 వరకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు.

ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవాలు...

యాదగిరీశుడి సన్నిధిలో రేపటి నుంచి జనవరి 15వ తేదీ వరకు ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఆరు రోజుల పాటు మొక్కు,శాశ్వత కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నార సింహోమంతో పాటు లక్షపుష్పార్చన పూజలు నిలిపివేయనున్నారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం స్వామివారు దశావతారాల్లో వివిధ అలంకార సేవల్లో భక్తులకు దర్శనమిచ్చి తరింపజేయనున్నాడు. వార్షిక అధ్యయనోత్సవాలకు ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్తర మాడవీధిలో వేదికను, సీటింగ్ గ్యాలరీలను ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చేందుకు వీలుగా మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

సకల పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం

ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్ర పద్ధతిలో వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు సుప్రభాతంతో పాటు నిత్య విధి కైంకర్యాలను సైతం ముందస్తుగానే ప్రారంభిస్తారు. భక్తుల దర్శనానంతరం స్వామివారి అలంకార సేవ ఆలయ తిరువీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరిస్తాయని, సకల సిరి సంపదలు సంప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Advertisement

Next Story