బుమ్రా గాయంపై నో అప్‌డేట్.. చాంపియన్స్ ట్రోఫీ ఆడతాడా?లేదా?

by Harish |
బుమ్రా గాయంపై నో అప్‌డేట్.. చాంపియన్స్ ట్రోఫీ ఆడతాడా?లేదా?
X

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా గురించే చర్చ. త్వరలో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీకి అతను అందుబాటులో ఉంటాడా?లేదా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. దానికి కారణం ఇటీవల బుమ్రా వెన్ను నొప్పితో బాధపడటమే. ఆస్ట్రేలియాతో ఐదో టెస్టులో అతను వెన్నునొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. అయితే, బుమ్రా గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు అప్‌డేట్ ఇవ్వకపోవడం గమనార్హం. బోర్డు మౌనంగా ఉండటంతో బుమ్రా పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే చాంపియన్స్ ట్రోఫీ ఆడతాడా?లేదా? అనే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. దూరమైతే మాత్రం టీమిండియాకు భారీ షాకే.

వచ్చే నెల 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించడానికి ఐసీసీ విధించిన గడువు ఈ నెల 12. బీసీసీఐ ఏ క్షణంలోనైనా భారత జట్టును ప్రకటించొచ్చు. బుమ్రా లేకుండా భారత జట్టును ఊహించుకోవడం కష్టమే. ఇటీవల అతను భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఆసిస్ టూరులో 32 వికెట్లతో రెచ్చిపోయాడు. అయితే, సిడ్నీ టెస్టులో బుమ్రా వెన్ను నొప్పితో ఇబ్బందిపడ్డాడు. ఆసిస్ తొలి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు వేసి మైదానం వీడాడు. వెంటనే బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని స్కానింగ్‌కు తీసుకెళ్లింది. ఆ తర్వాతి రోజు మైదానంలోకి వచ్చినా కేవలం బ్యాటింగే చేశాడు. బౌలింగ్ చేయలేదు. ఆ మ్యాచ్ అనంతరం బుమ్రా పరిస్థితిపై బీసీసీఐ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.

స్పెషలిస్ట్‌తో సంప్రదింపులు

వెన్ను నొప్పికి చికిత్స నిమిత్తం బుమ్రా న్యూజిలాండ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రోవన్ స్కౌటెన్‌ను సంప్రదించినట్టు సమాచారం. 2023లో అతను అదే డాక్టర్ వద్ద వెన్నుకు సర్జరీ చేయించుకున్నాడు. బీసీసీఐ వైద్య బృందంతో కలిసి బుమ్రా పరిస్థితిని రోవన్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బుమ్రా స్పెషలిస్ట్‌తో సంప్రదించడంతో గాయం తీవ్రత ఎక్కువ ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. గాయం గ్రేడ్ 1 కింద ఉంటే కోలుకోవడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పట్టొచ్చు. గ్రేడ్ 2 అయితే ఆరు వారాలు, తీవ్రమైన గ్రేడ్ 3 అయితే కనీసం మూడు నెలల సమయం పడుతుంది. గ్రేడ్ 1 అయితే బుమ్రా చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొడానికి సమస్య ఉండదు. కోలుకోవడానికి, ఆ తర్వాత ఫిట్‌నెస్ సాధించడానికి సమయం ఉంటుంది. కానీ, గ్రేడ్ 2, గ్రేడ్ అయితే మాత్రం టోర్నీకి దూరమైనట్టే.

చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు?

ఇంగ్లాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. గాయం నుంచి కోలుకుని టోర్నీకి సిద్ధమయ్యేందుకు అతనికి సమయం ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గాయం తీవ్రత ఇంకా తెలియనప్పటికీ ఓ వార్త అయితే జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించే జట్టులో బుమ్రాకు స్థానం కల్పించనున్నట్టు ఆ వార్తల సారాంశం. టోర్నీ నాటికి ఫిట్‌నెస్ సాధిస్తే అతన్ని తుది జట్టులోకి తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నదట.


Advertisement

Next Story

Most Viewed