కర్ణాటకలో మరో సంచలనం.. ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణ అరెస్ట్

by Harish |
కర్ణాటకలో మరో సంచలనం.. ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణ అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో జేడీ(ఎస్) పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొని అరెస్ట్ కాగా, తాజాగా ఆయన సోదరుడు జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను కర్ణాటక పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సూరజ్ లైంగిక దాడి చేశాడని చేతన్ అనే పార్టీ కార్యకర్త హూలెనరసిపురా పోలీస్​ స్టేషన్​లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శనివారం ఆయనపై కేసు నమోదైంది. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం బాధితుడిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్య పరీక్షల్లో అతని ఒంటిపై గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో సూరజ్ రేవణ్ణను పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేసి బెంగళూరుకు తీసుకువచ్చారు. సూరజ్‌పై IPC సెక్షన్లు 377 (అసహజ సెక్స్), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు.

కేసు వివరాల్లోకి వెళితే, జూన్​16న సాయంత్రం సూరజ్ రేవణ్ణ ఫామ్​హౌస్​లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 27 ఏళ్ల చేతన్ అనే పార్టీ కార్యకర్త ఆరోపించాడు. లోక్‌సభ ఎన్నికలలో తన పనిని చూసి ఆయన వీలున్నప్పుడల్లా తనను కలవాలని కోరాడని, ఈ క్రమంలో ఆయన వద్దకు వెళ్లగా బలంవంతగా లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడని తెలిపాడు. మరోవైపు సూరజ్ రేవణ్ణ, ఈ ఆరోపణలను తోసిపుచ్చారు, ఆ వ్యక్తి తనకు రూ.5 కోట్లు కావాలని డిమాండ్ చేశాడు. నేను దానికి ఒప్పుకోకపోవడంతో నాపై తప్పుడు ఫిర్యాదు చేశాడని తెలిపారు.

ఇదిలా ఉంటే, సూరజ్‌ అనుచరుడు శివకుమార్ కూడా హోళినరిసిపురం పోలీస్ స్టేషన్‌లో‌ చేతన్‌పై ఫిర్యాదు చేశాడు. ఈ నెల ప్రారంభంలో చేతన్ నన్ను కలిశాడని, ఉద్యోగం ఇప్పించాలని కోరగా అతనికి సూరజ్ ఫోన్ నంబర్ ఇచ్చి ఆయన్ను సంప్రదించాలని చెప్పాను. అయితే ఉద్యోగం రాకపోవడంతో బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడని శివకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. జేడీ(ఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జ్యుడీషియల్ కస్టడీకి పంపిన కొద్ది రోజులకే సూరజ్ అరెస్ట్ కావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed