Pm modi: 2036 ఒలంపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడమే లక్ష్యం.. ప్రధాని మోడీ

by vinod kumar |
Pm modi: 2036 ఒలంపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడమే లక్ష్యం.. ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: 2036లో జరిగే ఒలంపిక్స్‌ (Olympics)కు భారత్ ఆతిథ్యం ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) అన్నారు. ఈ విషయంలో ఎంతో వేగంగా అడుగులు వేస్తున్నామని నొక్కి చెప్పారు. ఒలింపిక్స్ నిర్వహణతో భారత్‌లో క్రీడా రంగం కొత్త శిఖరాలను చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోవాలో మంగళవారం జరిగిన 38వ నేషనల్ గేమ్స్ (National games) ప్రారంభోత్సవంలో మోడీ ప్రసంగించారు. ఒలంపిక్స్ కేవలం క్రీడా ఈవెంట్ కాదని, ఆ క్రీడలు ఎక్కడ జరిగినా అన్ని రంగాలూ లాభపడుతాయని తెలిపారు. క్రీడా కారులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావడానికి దోహదపడుతుందన్నారు. కొత్త కనెక్టివిటీని, రవాణా సౌకర్యాలను సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేగాక పర్యాటకాన్ని సైతం మెరుగుపరుస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమం ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలను, అథ్లెట్లను ఆకర్షిస్తుందని, ఇది పర్యాటక అభివృద్ధికి దారితీస్తుందని తెలిపారు.

దేశాభివృద్ధిలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని మోడీ నొక్కిచెప్పారు. క్రీడాకారుల సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. దేశాభివృద్ధిలో క్రీడలను ముఖ్యమైన అంశంగా భావిస్తున్నామని తెలిపారు. బలమైన సంస్థాగత మద్దతుతో భారత క్రీడా రంగం అభివృద్ధి చెందుతోందన్నారు. క్రీడా బడ్జెట్‌ను మూడు రెట్లు పెంచామని, క్రీడాకారుల ప్రయోజనాల కోసం కోట్లాది రూపాయలను వెచ్చించామని తెలిపారు. కాగా, 2023లో ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్‌లో 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలనే భారత్ ఉద్దేశాన్ని ప్రధాని మోడీ వ్యక్తం చేశారు. అనంతరం ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు ఉద్దేశించిన లేఖను భారత ఒలింపిక్ సంఘం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి సమర్పించింది. అయితే ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా 2036 హోస్టింగ్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. ఇందులో భారత్ విజయం సాధిస్తే దేశ క్రీడా చరిత్రలో మైలు రాయిగా నిలవనుంది.

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story