ఘోర ప్రమాదం.. 9 మంది దుర్మరణం

by D.Reddy |
ఘోర ప్రమాదం.. 9 మంది దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: వారంతా సంతోషంగా పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఎంతో సందడిగా గడిపారు. కొత్త దంపతులను ఆశీర్వదించి.. తిరుగు పయనమయ్యారు. కానీ ఇంతలోనే వారి జీవితాల్లో తీరని విషాదం చోటు చేసుకుంది. రెప్పపాటులో జరిగిన ప్రమాదం.. 9 మంది ప్రాణాలను బలిగొంది. వారు ప్రయాణిస్తున్న వాహనం కాలువలోకి దూసుకెళ్లడంతో 9 మంది మృతిచెందగా.. ఐదుగురు గల్లంతయ్యారు. హర్యాణా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

శుక్రవారం రాత్రి ఫతేహాబాద్ జిల్లా మెహమరా గ్రామానికి చెందిన 14 మంది.. పంజాబ్ రాష్ట్రంలోని ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న క్రూజర్ వాహనం సర్దారేవాలా గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పి భాఖాడా కాలువలో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడిక్కడే మృతి చెందగా, ఐదుగురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఇద్దరిని రెస్క్యూ టీంలు కాపాడాయి. మరో ముగ్గురి కోసం 50 మందితో సహాయక బృందాలు గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, 11 ఏళ్ల చిన్నారి ఉన్నట్లు సమాచారం. పలువురి మృతదేహాలు సుమారు 50 కి.మీ దూరంలో లభ్యం కావడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. తెల్లవారుజామున కావటంతో దట్టమైన పొగమంచు, డ్రైవర్ నియంత్రణ కోల్పొవటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed