రిజర్వేషన్ల అంశంలో దూకుడుగా ప్రభుత్వం.. నేడే సబ్ కమిటీకి కులగణన రిపోర్డు

by Gantepaka Srikanth |
రిజర్వేషన్ల అంశంలో దూకుడుగా ప్రభుత్వం.. నేడే సబ్ కమిటీకి కులగణన రిపోర్డు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 5న అసెంబ్లీ స్పెషల్ సెషన్‌తో పాటు కేబినెట్ మీటింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అంశాలపై తేల్చేందుకు వేగం పెంచిన సర్కారు.. అందులో భాగంగానే పలు చర్యలు చేపడుతున్నది. నేటి నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించి వాటిని ఆమోదించేందుకు ప్లాన్ చేస్తున్నది. నివేదికలు ప్రభుత్వానికి అందడం, అనంతరం కేబినెట్​సబ్​కమిటీ అధ్యయనం చేసి కేబినెట్‌కు అందించడం, ఆ తరువాత మంత్రివర్గంలో వాటికి ఆమోదం తెలిపి అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది.​కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రాష్ట్ర మంత్రివర్గం, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సుదీర్ఘంగా సమావేశమయ్యారు.

రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయాలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, వాటికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యల విషయాలను చర్చించారు. కేంద్రబడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చిన నిధులు, రాష్ట్ర బడ్జెట్​తదితర అంశాలపైనా డిస్కస్ చేశారు. వివిధ శాఖలకు, రంగాలకు బడ్జెట్ అవసరాలు, నిధుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్‌ వల్ల తెలంగాణ కలిగే ప్రయోజనం, నష్టంపై రంగాల వారీగా చేస్తున్న మంత్రివర్గం అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపైనా డిస్కస్ చేసినట్టు తెలిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్​కుమార్​ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస​రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వర్​రావు, దామోదర్​ రాజనర్సింహ, శ్రీధర్​బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కొమటిరెడ్డి వెంకట్​రెడ్డిలు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికలపైనా డిస్కషన్

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు టాక్. అందుకు అవసరమైన ప్రక్రియను సైతం పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం బీసీ డెడికేటెడ్ కమిషన్​ నివేదిక, ఎస్సీ వర్గీకరణ నివేదికలను తెప్పించుకొని వాటిని ఆమోదించాలని సమావేశంలో నిర్ణయించారు.

నేడు సబ్ కమిటీకి కులగణన రిపోర్డు

నేడు మధ్యాహ్నం 2 గంటలకు కులగణన నివేదికను రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తారు. అనంతరం దీనిపై చర్చించేందుకు సెక్రెటేరియట్‌లోని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినేట్ సబ్ కమిటీ సమావేశం కానున్నది. ఇందుకు చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర్ రాజానర్సింహ, సభ్యులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి సైతం హాజరవుతారు. ప్లానింగ్ కమిషన్ నివేదిక‌పై కేబినెట్​సబ్ కమిటీ ఆదివారం, సోమవారం చర్చించి అనంతరం ఆమోదం తెలుపనున్నది. అనంతరం నివేదికను రెడీ చేసి ఈ నెల 5న ఉదయం జరగనున్న కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నది. అక్కడ ఆమోదం లభించిన అనంతరం అదేరోజు మధ్యాహ్నం నిర్వహించనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో కులగణన నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. దానిపై ప్రత్యేక చర్చ అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలుపనున్నది. రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌లు అమలు చేసేందుకు కులగణన చేపట్టి నివేదిక తయారు చేయాలని, త్రిపుల్ టెస్ట్​చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీ డెడికేటెడ్​కమిషన్‌ను నియమించింది. సమగ్ర ఇంటింటి సర్వే చేపట్టింది. దాని ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించనున్నారు.

రెండు రోజులు కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ : మంత్రి పొన్నం

ఆదివారం, సోమవారం ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కమాండ్ కంట్రోల్‌లో శనివారం మీటింగ్ ముగిశాక మీడియాతో మాట్లాడారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే‌పై శాసన సభ తీర్మానం మేరకు ప్రత్యేక కమిషన్ వేసినట్టు తెలిపారు. సీఎం, మంత్రులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ప్రక్రియను పూర్తి చేసినట్టు వివరించారు. దీనిపై సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. ప్రధానంగా వర్గీకరణపై సబ్ కమిటీ తీసుకున్న ప్రొగెసివ్ యాక్టివిటీస్‌పై డిస్కస్ చేశామని పేర్కొన్నారు.

ఎస్సీ వర్గీకరణపై కేబినెట్‌లో చర్చ : మంత్రి దామోదర

ఎస్సీ వర్గీకరణపై కేబినెట్‌లో చర్చిస్తామని అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెడుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రెండు గంటల్లోనే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేశామని పేర్కొన్నారు. దీనిపై ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీ సైతం వేసినట్టు తెలిపారు. ఆ సబ్ కమిటీ సూచన మేరకు వన్ మ్యాన్ కమిషన్‌ను నియమించామన్నారు. సదరు కమిషన్ త్వరలోనే రిపోర్టు ఇవ్వనున్నదని. దానిపై కేబినెట్ లో చర్చించి, ఆపై అసెంబ్లీలో ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed