- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన కరువు

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర బడ్జెట్ 2025-26లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది. బడ్జెట్‌లో తెలంగాణ పేరును ఎక్కడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కొత్త కార్యక్రమాలకు, పథకాలకు, విద్యాసంస్థలకు నిధులు కేటాయించలేదు. ముఖ్యమంత్రి చేసిన వినతులను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా విభజన చట్టంలోని అంశాలను అమలు చేయలని, కొత్తగా ప్రతిపాదించిన వాటికి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఇందులో మెట్రో రెండో దశకు నిధుల కేటాయింపు ప్రధానమైనది. మెట్రో నిధుల విషయంలో కేంద్రంపై రాష్ట్రం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ నిధుల ద్వారా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే ప్రైవేటు సంస్థలు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే మెట్రో రెండో దశను చేపట్టాలని సీఎం ఆలోచన చేశారు. ఈ మేరకు ప్రధానికి వినతిపత్రం అందచేశారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. డీపీఆర్‌ను రూపొందించి కేంద్రానికి పంపించారు. కానీ ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. బడ్జెట్‌లో కేటాయించకుండా నిధులు విడుదల చేయడమనేది కష్టతరమైన విషయమని నిపుణులు చెబుతున్నారు.
పన్నుల వాటాలో పెంపు లేదు!
విభజన చట్టం హామీ మేరకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉన్నది. కానీ, దీనిపై ఎలాంటి కదలికలేదు. దీంతో పాటు పీఎం ఆవాస్ యోజన ఇండ్లలో రాష్ట్రానికి 20 లక్షల ఇండ్లు కేటాయించాలని సీఎం కేంద్రాన్ని కోరారు. వరంగల్‌నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి నిధులు కేటాయించాలని కోరారు. నగర పాలక సంస్థలు, ఇతర మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు, మూసీ నది పునరుజ్జీవానికి, స్కిల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐఐఎం ఏర్పాటు, సైనిక్ స్కూల్, నవోదయ విద్యాలయాలు ఇలా కేంద్రాన్ని తెలంగాణ అడిగినా కనీసం స్పందించలేదు. పన్నుల వాటా కేటాయింపులు పెంచలేదు. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, నూతన పారిశ్రామిక కారిడార్‌లు, డ్రై పోర్టుకు నిధులపై ప్రస్తావన రాలేదు.