స్టేజీపైనే ప్రధాని మోడీ కన్నీళ్లు.. ఎందుకు ఎమోషనల్ అయ్యారంటే..

by Hajipasha |
స్టేజీపైనే ప్రధాని మోడీ కన్నీళ్లు.. ఎందుకు ఎమోషనల్ అయ్యారంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకొని ప్రధానమంత్రి నరేంద్రమోడీ భావోద్వేగానికి గురయ్యారు. తన కన్నీటిని ఆపుకొని మాట్లాడుతూ.. ‘‘నేను ఆ ఇళ్లను చూడటానికి వెళ్లాను. చిన్నప్పుడు నేను కూడా ఇలాంటి ఇంట్లో నివసించి ఉంటే బాగుండేదని అనిపించింది. వేలాది కుటుంబాల సొంతింటి కలలు నెరవేరడం చూస్తుంటే ఎంతో తృప్తిగా అనిపిస్తోంది. వాళ్ల ఆశీస్సులే నాకు పెద్ద ఆస్తి’’ అని ప్రధాని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఉన్న రాయ్ నగర్ హౌసింగ్ సొసైటీలో కొత్తగా నిర్మించిన 15వేల ఇళ్ల పట్టాలను చేనేత కార్మికులు, చిరువ్యాపారులు, పవర్ లూమ్ కార్మికులు, చెత్త ఏరుకునేవారు, బీడీ కార్మికులు, డ్రైవర్ల వంటి పేద వర్గాల వారికి అందజేసే కార్యక్రమంలో ప్రసంగిస్తూ మోడీ ఎమోషనల్ అయ్యారు. దీంతో ఆయన గొంతు ఒక్కసారిగా మారిపోయింది. కనీసం ఈ కార్మికులకైనా ఆ అదృష్టం లభించిందని అన్నారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా ఇప్పటివరకు ఒక్క మహారాష్ట్రలోనే 90వేల మందికి ఇళ్లను నిర్మించి అందించామని ప్రధాని తెలిపారు. దేశ ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలన్న తమ తాపత్రయానికి ఇదే నిదర్శనమని చెప్పారు. మోడీ అంటే గ్యారంటీ.. పక్కాగా పూర్తయ్యే గ్యారంటీ అని అర్థమన్నారు. ఇచ్చిన మాటను గౌరవించాలని శ్రీరాముడు బోధించాడని.. తాము చేస్తున్నది కూడా అదేనని మోడీ పేర్కొన్నారు. ‘‘మూడోసారి కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న ధీమా ఉంది. మేం అధికారంలోకి వచ్చాక భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే మూడో స్థానానికి తీసుకెళ్తాం. ఇది నేను ప్రజలకు ఇస్తున్న హామీ’’ అని తెలిపారు. జనవరి 22న రామజ్యోతిని వెలిగించాలని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. కాగా, శుక్రవారం తన పర్యటన సందర్భంగా సోలాపూర్‌లో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

Advertisement

Next Story