ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పీఎఫ్ఐ కుట్రలు

by GSrikanth |
ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పీఎఫ్ఐ కుట్రలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఈ సంస్థ శిక్షణ ఇస్తున్నదని ఆరోపిస్తూ గతవారం అనేక రాష్ట్రాల్లోని ఈ సంస్థకు చెందిన కార్యాలయాలు, ముఖ్య నేతల ఇళ్లపై ఎన్ఐఏ, ఈడీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే సమాచారం సేకరించగా తాజాగా మరో సంచలన విషయం వెలుగు చూస్తోంది. వచ్చే నెల దసరా సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అగ్రనేతలను టార్గెట్‌గా చేసుకుని దాడులకు పీఎఫ్ఐ కుట్రలు పన్నుతున్నట్లు తాజాగా మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వర్గాలు వెల్లడించాయి.

పీఎఫ్ఐ హిట్ లిస్ట్‌లో నాగ్ పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉందని మహారాష్ట్రలో దసరా ఉత్సవాల వేళ ఈ సంస్థకు చెందిన కీలక నేతలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక పీఎఫ్ఐ సిద్ధం చేసుకుందని ఆ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తో పాటుగా పలువురు ప్రభుత్వ దర్యాప్తు సంస్థల సభ్యులు వీరి జాబితాలో ఉన్నారని ఈ ఆపరేషన్లు అమలు చేసేందుకు పీఎఫ్ఐ సంస్థ సభ్యులు ఇప్పటికే రెక్కీలు కూడా నిర్వహించినట్లు హెచ్చరించారు. ఎన్ఐఏ, ఈడీ దర్యాప్తుల్లో ఈ ఏడాది జులై 12న ప్రధాని పాట్నా పర్యటన సమయంలో అల్లర్లకు కుట్ర జరిగిందని బహిర్గతం అయింది. తాజాగా వీరి హిట్ లిస్ట్‌లో దసరా టార్గెట్‌గా మరో కుట్ర దాగి ఉందని పోలీసులు గుర్తించడంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలోని యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేలా ఈ సంస్థ ప్రత్యేక శిక్షణ, ప్రోత్సాహాం అందిస్తుందన్న ఆరోపణలపై ఇప్పటికే పీఎఫ్ఐకి చెందిన 100 మందికి పైగా సభ్యులను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో టార్గెట్ దసరగా మరో కుట్ర కోణం వీరి వద్ద సిద్ధంగా ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.

Advertisement

Next Story