ఆగస్టు చివరి నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి 'యూ-విన్' పోర్టల్

by S Gopi |
ఆగస్టు చివరి నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి యూ-విన్ పోర్టల్
X

దిశ, నేషనల్ బ్యూరో: కొవిడ్-19 వ్యాక్సిన్ నిర్వహణ కోసం రూపొందించిన కో-విన్ తరహాలో పిల్లలు, గర్భిణీల టీకా పంపిణీ కోసం తీసుకొచ్చిన 'యూ-విన్ ' పోర్టల్‌ను ఆగష్టు చివరి నాటికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ ఆన్‌లైన్ పోర్టల్‌ను పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా కొనసాగుతోంది. ఇంకా డేటాను అప్‌లోడ్ చేయడం ప్రారంభించలేదని, రాష్ట్రాల్లో ఇంకా పరిశీలన దశలో ఉందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 2024-2025 మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇమ్యునైజేషన్ నిర్వహణ కోసం మిషన్ ఇంద్రధనుష్ కింద యూ-విన్‌ని దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మీజిల్స్, రూబెలా, డిప్తీరియా, టెటానస్ లాంటి వివిధ రకాల వ్యాధులను ఎదుర్కోవడానికి చిన్నారులు, గర్భిణీలకు ప్రభుత్వం పలు టీకాలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని టీకాల వివరాలను యూ-విన్‌లో పొందుపరిచేందుకు దీన్ని తీసుకొచ్చారు. డిజిటైజేషన్ ద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఎక్కడనుంచైనా పొందేలా ఇది పనిచేస్తుంది. ప్రైవేట్ సెంటర్లలో ఇచ్చే టీకాలు కూడా ఇందులోనే పొందుపరిచేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. యూ-విన్ పోర్టల్, యాప్ ద్వారా ప్రజలు వ్యాక్సిన్ కోసం స్వయంగా రిజిస్టర్ చేసుకునే వీలుంటుంది. రిజిస్ట్రేషన్, వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి అలర్ట్ మెసేజ్ కూడా వస్తుంది.

Advertisement

Next Story