ప్రతి 4 గురు బీజేపీ-కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఒకరికి రాజకీయ వారసత్వం

by Harish |
ప్రతి 4 గురు బీజేపీ-కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఒకరికి రాజకీయ వారసత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి నలుగురు బీజేపీ, కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల్లో ఒకరు తమ కుటుంబ వారసత్వం కారణంగానే రాజకీయాల్లోకి వచ్చారని ప్రజాతంత్ర ఫౌండేషన్ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిపి 768 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా వారిలో 209 మంది రాజకీయ వారసత్వం ఉన్న కుటుంబాల నుంచి వచ్చారని, వీరిలో ఎక్కువ మంది రెండో తరం రాజకీయ నాయకులే అని నివేదిక పేర్కొంది. సర్వేలో తేలిన అంశాల ప్రకారం, వంశపారంపర్య రాజకీయాలను విపక్షాలు ప్రోత్సహిస్తాయని తరచుగా విమర్శించే అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రస్తుత ఎన్నికల్లో అది నిలబెట్టిన 442 మంది అభ్యర్థులలో 110 మంది (24.88 శాతం) రాజకీయ వారసత్వాన్ని కలిగి ఉండటం గమనార్హం. కాంగ్రెస్ విషయానికి వస్తే, దాని 326 మంది అభ్యర్థులలో 99( 30.36 శాతం) మంది రాజకీయ వారసత్వాన్ని కలిగి ఉన్నారు.

బీజేపీ అభ్యర్థుల్లో 69 మంది రెండవ తరం రాజకీయ నాయకులే ఉన్నారు. ఉదాహరణకు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ స్థానం నుంచి రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ మనవడు రవ్‌నీత్ సింగ్ బిట్టు, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే కుమారుడు దుష్యంత్ సింగ్, అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు మొదలగు వారు రెండవ తరం నాయకులుగా ఉన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థుల్లో నాలుగో తరం రాజకీయ నాయకుడిగా రాహుల్ గాంధీ మాత్రమే నిలిచారు. అభ్యర్థుల్లో 80 మంది రెండవ తరం రాజకీయ నాయకులు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల, కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్, సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణితి షిండే, దివంగత తరుణ్ గొగోయ్ కుమారుడు, గౌరవ్ గొగోయ్. వీరంతా కూడా మాజీ ముఖ్యమంత్రుల పిల్లలు కావడం గమనార్హం.

గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయడం అనేది డబ్బులతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఆర్థికంగా స్థిరంగా ఉన్న అభ్యర్థులు పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆర్థిక వనరులు, ప్రభావవంతమైన నెట్‌వర్క్‌లు, ప్రచారాల ఖర్చులకు అధిక మొత్తంలో ఆర్థిక వనరులు అవసరం అవుతాయి. ఇలాంటి తరుణంలో సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. ముఖ్యంగా రాజవంశ నేపథ్యం ఉన్న అభ్యర్థులకు ఇలాంటివి పొందడం చాలా సులువు కావడంతో వారు పోటీకి దిగుతున్నట్లు సర్వేలో తేలింది.

Advertisement

Next Story

Most Viewed