One Nation One Election Bill: లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు.. వ్యతిరేకించిన ప్రతిపక్షాలు

by Shamantha N |
One Nation One Election Bill: లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు.. వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లుని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ లోక్ సభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. ఏకకాలంలో ఎన్నికలు జరిగేలా ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లు (One Nation One Election Bill)ను లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టారు. దీనిపైన పార్లమెంటులో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఏకకాల ఎన్నికలు పాలనను క్రమబద్ధీకరిస్తాయనీ, ఎన్నికల ఖర్చును తగ్గిస్తాయనీ అధికార బీజేపీ చెబుతోంది. కాగా.. ఇది సమాఖ్య వ్యవస్థను నాశనం చేస్తుందని, ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.

బిల్లుని వ్యతిరేకించిన ప్రతిపక్షాలు

వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తిరస్కరించగా.. టీపీడీ మాత్రం సమర్థించింది. జమిలి బిల్లు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని సవాలు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ దాన్ని వ్యతిరేకించారు. బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తోందని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ దర్మేంద్ర యాదవ్ అన్నారు. ఇది దేశ వైవిధ్యాన్ని, దాని సమాఖ్య నిర్మాణాన్ని అంతం చేస్తుందని ఆయన అన్నారు. తృణమూల్ ఎంపి కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని అంతంచేసేలా ఈ బిల్లు ఉందన్నారు. ఇది అల్ట్రా వైరస్ అని విమర్శించారు. కాగా.. కేంద్ర ప్రభుత్వానికి 2/3 వంతు మెజారిటీ లేనప్పుడు పార్లమెంటులో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లును ఎలా ప్రవేశపెడతారని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు ప్రశ్నించారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ ఈటీ మహ్మద్ బషీర్ జమిలి బిల్లుని వ్యతిరేకించారు. ఇది భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి అని నిప్పులు చెరిగారు.

ప్రతిపక్షాలపై కిరణ్ రిజిజు ఫైర్

మరోవైపు, ప్రతిపక్ష కాంగ్రెస్ పై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఫైర్ అయ్యారు. 'వన్ నేషన్, వన్ పోల్'పై సహేతుకమైన వాదన లేదని మండిపడ్డారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, సమాఖ్య వ్యవస్థకు హాని కలిగిస్తుందని అపోహలు సృష్టిస్తుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన రెండు దశాబ్దాల పాటు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయని గుర్తుచేశారు. నెహ్రూ ప్రభుత్వం, ఆ తర్వాత పనిచేసిన ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధమా? అని కాంగ్రెస్ ని ప్రశ్నించారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు. అందుకే కాంగ్రెస్ కలవరపడుతోందని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed