Jammu Kashmir: జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో ఐదుకి చేరిన మృతుల సంఖ్య

by Shamantha N |
Jammu Kashmir: జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో ఐదుకి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌ ఉగ్రదాడిలో మృతుల సంఖ్య ఐదుకి చేరింది. గురువారం సాయంత్రం నాగిన్‌ పోస్టు వైపు వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆర్మీలో పనిచేస్తున్న ఇద్దరు కూలీలతోపాటు ఇద్దరు సైనికులు కూడా ఉగ్రవాదుల కాల్పుల్లో ఘటనాస్థలిలోనే చనిపోయారు. మరో జవాన్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో, ఉగ్రదాడిలో మృతుల సంఖ్య ఐదుకి చేరినట్లైంది. గాయపడిన మరొకరికి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బారాముల్లాలోని బుటాపత్రి నాగిన్‌ ప్రాంతంలో సామాగ్రి తీసుకెళ్తున్న మిలటరీ ట్రక్కుపై గురువారం సాయంత్రం ఉగ్రవాదులు దాడులు జరిపినట్లు ఆర్మీ అధికారులు ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఉగ్రవాదులు, సైనికుల మధ్య కాల్పులు

మిలటరీ ట్రక్కుపై దాడి జరగడంతో.. ఉగ్రవాదులు, 18వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సైనికుల మధ్య కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఘటనాస్థలిలో టెర్రరిస్టుల కోసం ఆర్మీ బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. అంతకుముందు, పుల్వామా జిల్లాలోని త్రాల్‌ ప్రాంతంలోనూ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శుభంకుమార్‌ అనే కార్మికుడు గాయపడ్డాడు. కాగా గత 72 గంటల్లో కేంద్రపాలిత ప్రాంతంలో ఆర్మీ వాహనంపై దాడి జరగడం ఇది రెండోది. మూడు రోజుల క్రితం టన్నెల్ నిర్మిస్తున్న నిర్మాణ కార్మికుల హౌసింగ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురు కార్మికులు, ఒక వైద్యుడు మరణించారు.

Advertisement

Next Story

Most Viewed