ఒమర్ అబ్దుల్లా విడాకుల పిటిషన్‌పై ఆయన భార్యకు సుప్రీంకోర్టు నోటీసులు

by S Gopi |
ఒమర్ అబ్దుల్లా విడాకుల పిటిషన్‌పై ఆయన భార్యకు సుప్రీంకోర్టు నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్‌ అబ్దుల్లా విడాకుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆయన భార్య పాయల్‌ అబ్దుల్లాకు నోటీసులు జారీ చేసింది. తన భార్య నుంచి విడాకులు కోరుతూ తాను చేసిన అభ్యర్థనను ఇదివరకే ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ ఒమర్ అబ్దుల్లా భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సుధాన్షు ధులియా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని పాయల్ అబ్దుల్లాకు స్పష్టం చేసింది. ఒమర్ అబ్దుల్లా తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. గత 15 ఏళ్లుగా వారిద్దరూ విడిగా ఉంటున్నారు. కాబట్టి వారి వైవాహిక జీతం ముగిసిందని కోర్టుకు వివరించారు. వీరిద్దరి విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరారు. 2023లో న్యాయమూర్తులు సంజీవ్ సచ్‌దేవా, వికాస్ మహజన్‌లతో కూడిన ధర్మాసనం 2016 ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. పాయల్ అబ్దుల్లాపై చేసిన ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయని పేర్కొంటూ ఒబర్ అబ్దుల్లాకు విడాకులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఫ్యామిలీ కోర్టు ఆదేశాల్లో ఎలాంటి లోపం లేదని ఢిల్లీ హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

Next Story