Bihar: తుపాకీతో ఐదేళ్ల చిన్నారి ఆట.. పదేళ్ల బాలుడిపై కాల్పులు

by Shamantha N |
Bihar: తుపాకీతో ఐదేళ్ల చిన్నారి ఆట.. పదేళ్ల బాలుడిపై కాల్పులు
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లోని ఐదేళ్ల బాలుడు తుపాకీతో కాల్పులు జరిపిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడో తరగతి చదువుతున్న పదేళ్ల బాలుడిపై చిన్నారి కాల్పులు జరిపాడు. దీంతో, బాలుడిచేతికి గాయమయ్యింది. ఈ ఘటన బిహార్ లోని సుపాల్ జిల్లాలో జరిగింది. నర్సరీ విద్యార్థి అయిన ఐదేళ్ల బాలుడు ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. అయితే, తన బ్యాగులో తుపాకీ దాచుకుని పాఠశాలకు వెళ్లాడు. ఆ తర్వాత మూడో తరగతి విద్యార్థిపై కాల్పులు జరిపాడు. సుపాల్ ఎస్పీ షైషవ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం "అదే పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలుడిపై విద్యార్థి కాల్పులు జరిపాడు. బుల్లెట్ అతని చేతికి తగిలింది" అని వెల్లడించారు. గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించామన్నారు. లాల్‌పట్టి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో వారిద్దరూ చదువుకుంటున్నారని పేర్కొన్నారు. పాఠశాలకు తుపాకీ ఎలా తీసుకెళ్లగలిగాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సుపాల్ జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగులను రోజూ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని యాజమాన్యాలను అధికారులు కోరారు. ఈ ఘటన వల్ల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.

Advertisement

Next Story