Trudeau: అమెరికాలో కెనడా భాగమయ్యే అవకాశమే లేదు.. ట్రంప్ నకు ట్రూడో కౌంటర్

by Shamantha N |
Trudeau: అమెరికాలో కెనడా భాగమయ్యే అవకాశమే లేదు.. ట్రంప్ నకు ట్రూడో కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) విమర్శలు గుప్పించారు. కెనడాను 51వ రాష్ట్రంగా మార్చాలని ట్రంప్ మరోసారి ప్రతిపాదనను తీసుకొచ్చారు. దీనికి ట్రూడో కౌంటర్ ఇచ్చారు. అమెరికాలో విలీనమయ్యే అవకాశమే లేదని స్పష్టంచేశారు. ఈమేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ‘కెనడా అమెరికాలో భాగమయ్యే అవకాశమే లేదు. రెండు దేశాలలోని కార్మికులు, ప్రజలు వాణిజ్యం, భద్రతా భాగస్వామ్యం ద్వారా లాభపడుతున్నారు’ అని ట్రూడో రాసుకొచ్చారు. కాగా.. ట్రూడో వ్యాఖ్యలకు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కూడా మద్దతు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు కెనడా ఎప్పటికీ వెనక్కి తగ్గదని అన్నారు. కెనడా ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ అవగాహన రాహిత్య వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు."మా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. మా ప్రజలే మా బలం. ఈ బెదిరింపులకు మేం ఎప్పటికీ వెనక్కి తగ్గం" అని మెలానీ జోలీ సోషల్ మీడియా ఎక్స్ లో రాసుకొచ్చారు. ట్రంప్ మిత్రుడు ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఆమె అన్నారు.

ట్రంప్ ఏమన్నారంటే?

ఇకపోతే, ఇటీవల కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఆ తర్వాత, కెనడా ప్రధాని ట్రూడో (Trudeau).. ట్రంప్‌తో భేటీ అయ్యారు. వలసలు, డ్రగ్స్‌ అక్రమరవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేనిపక్షంలో సుంకాలు పెంచుతానని ట్రంప్‌ హెచ్చరించారు. అంతేకాక, ఇందులో విఫలమైతే అమెరికా (USA)లో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోకు చురకలంటించారు. మరోవైపు.. ట్రూడో తన ప్రధాని పదవికి త్వరలో రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, లిబరల్‌ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు తెలిపారు. తన వారసుడిని పార్టీ ఎంపిక చేసేవరకూ ప్రధాని పదవిలో కొనసాగుతానని స్పష్టీకరించారు. పార్టీ పదవితో పాటు ప్రధాని బాధ్యతలు మార్క్‌ కార్నీ, లీ బ్లాంక్‌లలో ఒకరు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి టైంలోనూ కెనడా 51వ రాష్ట్రంగా చేరాలనే తన ప్రతిపాదనను ట్రంప్‌ (Trump) మరోసారి లేవనెత్తారు. ఈ కామెంట్లపైనే ట్రూడో కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed