జేడీయూకు 4 కేంద్ర మంత్రి పదవులు

by S Gopi |   ( Updated:2024-06-05 14:21:00.0  )
జేడీయూకు  4 కేంద్ర మంత్రి పదవులు
X

దిశ, నేషనల్ బ్యూరో: జూన్ 4న వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంలో సందిగ్ధత నెలకొంది. అయితే మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం బీజేపీకి ఉన్నా.. కూటమిలోని పార్టీలు ఎప్పుడు జారిపోతాయోననే సందేహాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత టీడీపీ, జేడీయూ పార్టీలు కీలకంగా మారాయి. దాంతో అవకాశం దొరికితే కూటములు మార్చే చరిత్ర ఉన్న జేడీయూ అధినేత నితీష్ కుమార్‌పై అందరి దృష్టి పడింది. కానీ ఆయన ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 12 మంది జేడీయూ ఎంపీల బలం బీజేపీకి కీలకంగా మారడంతో నితీష్ కుమార్ బేరసారాలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఎక్కువ మంత్రి పదవులు, కేంద్ర నిధులు, ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు, బీహార్‌కు ప్రత్యేక హోదా లాంటి అంశాలను ఆయన బీజేపీ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. 2014 తర్వాత తొలిసారిగా బీజేపీ మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో సగం మార్కుకు దూరమైంది. కాబట్టి నితీష్ కుమారు లాంటి మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అందుకోసం కనీసం 4 నుంచి 5 కేబినెట్ బెర్తులను నితీష్ కుమార్ డిమాండ్ చేయవచ్చని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలకు ముందు జేడీయూకి కనీసం 3 కేబినెట్ బెర్త్‌లు, ఒక కేంద్ర సహాయ మంత్రి పదివిని హామీ ఇచ్చింది. ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉండటంతో అదనంగా మరో కేబినెట్ మంత్రి పదవిని ఆశిస్తున్నట్టుగా నితీశ్ సంకేతమిచ్చినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా రైల్వే, గ్రామీణాభివృద్ధి, జలవనరుల వంటి కీలక శాఖలపై జేడీయూ ఆసక్తి ఉందని, బీహార్‌కు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పొందడాంకి జేడీయూ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ నేత చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధిని వేగవంతం చేయడంలో అవసరమైన పోర్ట్‌ఫోలియోలు అవసరమని భావిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీహార్‌లో ఉన్న మొత్తం 340 లోక్‌సభ సీట్లలో 30 స్థానాలు గెలిచిన జేడీయూ ఈ అనుకూల వాతావరణాన్ని సదివినియోగం చేసుకునేందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అయితే, ప్రస్తుతానికి జేడీయూ ముందస్తు ఎన్నికల డిమాండ్‌ను బీజేపీ నేతలు వ్యతిరేకరిస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ..

ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ సాధించిన ఘన విజయంతో జాతీయ స్ధాయిలో ఆ పార్టీకి చాలా కాలం తర్వాత అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పుడు కేంద్రంలో ఏర్పడుతున్న మూడో ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషించనుంది. ఇందులో భాగంగా చంద్రబాబు సైతం ప్రధాని మోడీ, అమిత్ షాల ముందు కీలక డిమాండ్లు పెట్టబోతున్నట్లు సమాచరం. జాతీయ మీడియా కథనాల ప్రకారం కేంద్రంలో మంత్రి పదవులతో పాటు స్పీకర్ పోస్టును టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా 16 సీట్లు సాధించిన టీడీపీ కనీసం నాలుగు మంత్రి పదవులు కోరనున్నది. అందులో రవాణా, వ్యవసాయం, జల్‌శక్తి, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య మంత్రిత్వ శాఖలను ఆశించే ప్రయత్నాల్లో ఉంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఎల్‌జేపీకి ఒక బెర్తు ఖాయం?

మరోవైపు, అదే రాష్ట్రంలోని లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూలతో పాటు లోక్‌జనశక్తి పార్టీ(రాం విలాస్‌) కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. పోటీ చేసిన ఐదింటిలోనూ గెలుచుకుని ఎన్డీఏ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటడంలో తన వంతు పాత్ర పోషించింది. దాంతో ఎల్‌జేపీ(రాంవిలాస్‌) పార్టీ అధినేత చిరాగ్‌, తన తండ్రి దివంగత ఎల్జేపీ చీఫ్‌ రాంవిలాస్‌ పాశ్వాన్‌కు అసలు సిసలైన రాజకీయ వారసుడిగా మారారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కూడా కేంద్రంలో ఒక మంత్రి పదవి ఆశిస్తోంది. అలాగే, మరొక సహాయ మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నట్టు ఎల్‌జేపీ-ఆర్‌వీ నేత ఒకరు చెప్పారు. ఈ విషయంలో బీజేపీ నుంచి కూడా హామీ లభించినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించేందుకు చిరాగ్‌ పాశ్వాన్‌ నిరాకరించారు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది పూర్తిగా ప్రధాని మోడీ నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed