బాణాసంచా పేలినా.. ఆ దేశం మనకు వివరణ ఇస్తోంది : సీఎం

by Hajipasha |
బాణాసంచా పేలినా.. ఆ దేశం మనకు వివరణ ఇస్తోంది : సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే శకం ముగిసిపోయిందని ఆయన చెప్పారు. ‘‘ ఈ నవభారతం ఒట్టి మాటలు చెప్పదు.. నేరుగా శత్రువుల ఇళ్లలోకి ప్రవేశించి దాడి చేస్తుంది’’ అని పేర్కొన్నారు. మంగళవారం యూపీలోని రాంపూర్‌లో బీజేపీ లోక్‌‌సభ అభ్యర్థి ఘనశ్యాం లోధికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. ‘‘మీరు కర్తార్‌పూర్ సాహిబ్‌ను చూసి ఉంటారు. దానికి గతంలో పాకిస్తాన్, కాంగ్రెస్ అడ్డంకిగా నిలిచేవి. ప్రధాని మోడీ చొరవచూపి కర్తార్‌పూర్ సాహిబ్‌ కారిడార్‌ను తెరిపించారు. మోడీ జీ దేశం కోసం చేయాల్సినవి అన్నీ చేశారు. అయోధ్యలో రాముడి ఆలయాన్ని కూడా నిర్మించారు’’ అని ఆయన వివరించారు. ‘‘ఇప్పుడు బాణాసంచా పేలినా పాకిస్తాన్ వచ్చి మన దేశానికి వివరణ ఇచ్చుకుంటుంది. ఆ బాణాసంచా పేలుడు వెనుక తాము లేమని భారత్‌కు పాక్ చెబుతుంది. అంతటి భయం ఇప్పుడు పాక్‌లో ఉంది. శత్రుదేశం చాలా భయపడిపోయింది. ఇదే నవ భారతదేశం’’ అని యూపీ సీఎం తెలిపారు. ఇక ముజఫర్‌నగర్‌లో జరిగిన మరో ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘యూపీలో ప్రస్తుతం మాఫియా దుస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. వాళ్ల పేర్లు చెబితే ఒకప్పుడు కర్ఫ్యూ వాతావరణం ఏర్పడేది. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నపుడు మాఫియా లీడర్‌ కాన్వాయ్‌కి ఏకంగా సీఎం కాన్వాయ్‌ దారి ఇచ్చే పరిస్థితి ఉండేది. మేం అధికారంలోకి వచ్చి చర్యలు తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మాఫియా నేతల ప్యాంట్లు తడుస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story