ఎన్డీయే ఆపరేషన్ ఆకర్ష్

by S Gopi |
ఎన్డీయే ఆపరేషన్ ఆకర్ష్
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ మెజారిటీ కోల్పోయి 240 సీట్లకు పరిమితమైంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి 293 సీట్లతో మూడవసారి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బుధవారం జరిగిన కూటమి పక్షాల సమావేశంలో మిత్రపక్షాలు నరేంద్ర మోడీనే ప్రధానిగా ఎన్నుకున్నాయి. ఈ సందర్భంగా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ఎన్డీఏ మరింత సామర్థ్యంతో పనిచేస్తుందని మోడీ ఈ సందర్భంగా భాగస్వామ్య పక్షాలకు హామీ ఇచ్చారు. గత 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ స్వయంగా మ్యాజిక్ ఫిగర్ 272ని దాటి సీట్లను కైవసం చేసుకుంది. కానీ, ఈ సారి మాత్రం మెజారిటీకి కేవలం 32 సీట్ల దూరంలో ఆగిపోయింది. సొంత సీట్లు తగ్గిపోవడంతో మిత్రపక్షాల్లో 16 సీట్లు గెలుచుకున్న చంద్రబాబు నాయుడు టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ (12), ఏక్నాథ్ షిండే శివసేన (7), చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ-రామ్ విలాస్ (5) పార్టీలు బీజేపీ మెజారిటీకి కీలకంగా మారాయి. అయితే, సంకీర్ణ ప్రభుత్వంగా మోడీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మిత్రపక్షాలు తమ డిమాండ్లు, మంత్రి పదవుల లిస్టును వారు బీజేపీ ముందు పెడుతున్నారు. అవకాశాన్ని వదులుకోకూడదనే ఉద్దేశ్యంతో వారు కీలక పోర్ట్‌ఫోలియోలను దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే వరుసగా రెండుసార్లు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ఇది ఇష్టం లేదన్నట్టు కనిపిస్తోంది. సీట్లు తగ్గాయనే కారణంతో మిత్రపక్షాల డిమాండ్లకు లొంగకూడదనే ఉద్దేశంలో బీజేపీ ఉన్నట్టు సమాచారం. కీలక మంత్రిత్వ శాఖలను తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తోంది. దీనికోసం బీజేపీలోని కీలక నేతలైన రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు మోడీ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.

మిత్రపక్షాల డిమాండ్లు..

బీజేపీ తర్వాత ఎన్డీఏ కూటమిలో ఎక్కువ సీట్లు గెలిచిన టీడీపీ 16 మంది ఎంపీలను కలిగి ఉంది. ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ప్రధానిగా మోడీగా ఎన్డీఏకు మద్దతిస్తున్నట్టు చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగమవుతుందా లేక బయటి నుంచి మద్దతిస్తుందా అనే విషయంలో బీజేపీ అగ్ర నాయకత్వానికి ఆయన ఇంకా స్పష్టం చేసినట్టు ఖరారు కాలేదు. చర్చల తర్వాత పార్టీ ప్రభుత్వంలో చేరవచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ తమ పార్టీకి ఎలాంటి హామీలు ఇస్తుందనే విషయంపై స్పష్టత వచ్చే వరకు వేచి ఉండాలని వారు భావిస్తున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం టీడీపీ లోక్‌సభ స్పీకర్ పదవిని గట్టిగా ఆశిస్తోంది. అలాగే నాలుగు కేంద్ర మంత్రి పద్వులను, ఒక సహాయ మంత్రి పదవిని కోరుతోంది. అంతేకాకుండా గతంలోనూ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో ఎన్డీయే కన్వీనర్‌గా చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత కింగ్ మేకర్ అవకాశం రావడంతో ఎన్డీయే కూటమిలో టీడీపీ కీలక పాత్ర పోషించే అవకాశం లభించింది. మరో కీలక జేడీయూ అధినేత నితీష్ కుమార్ సైతం పలు కీలక శాఖలను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో నితీష్ కుమార్ రైల్వే, వ్యవసాయం, రవాణా శాఖలను చేపట్టారు. ఇప్పుడు కూడా వాటినే అడుగుతున్నట్టు సమాచారం. కానీ బీజేపీ అందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. అంతేకాకుండా హోంశాఖ, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు శాఖలను తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే స్పష్టం చేసినట్టు వినవస్తోంది.

తటస్థుల కోసం వేట..

ఓవైపు సీట్లు మ్యాజిక్ ఫిగర్‌కు దూరం కావడం, మరోవైపు మిత్రపక్షాలపై ఆధారపడే పరిణామాలు చోటుచేసుకోవడంతో బీజేపీ తన స్టైల్‌లో ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను సైతం చీల్చి అధికారం దక్కించుకున్న బీజేపీకి మిత్రపక్షాలపైనే ఆధారపడటం ఇష్టంలేదు. దానికోసం ఇతర పార్టీల వారిని ఎన్డీఏలోకి ఆహ్వానించే ఎత్తుగడలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే తటస్థ పార్టీల నేతలతో సంప్రదింపులు కూడా ప్రారంభించినట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆ బాధ్యతలను కూడా రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా, జేపీ నడ్డాల భుజాలపై వేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed