Najma Heptulla: ఆమె కోసం గంట సేపు ఫోన్ లోనే వేచిచూశా.. సోనియాపై నజ్మా హెప్తుల్లా విమర్శలు

by Shamantha N |   ( Updated:2024-12-01 11:25:47.0  )
Najma Heptulla: ఆమె కోసం గంట సేపు ఫోన్ లోనే వేచిచూశా.. సోనియాపై నజ్మా హెప్తుల్లా విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)పై మణిపూర్ మాజీ గవర్నర్ నజ్మా హెప్తుల్లా(Najma Heptulla) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్‌పర్సన్, బీజేపీ నాయకురాలు నజ్మా హెప్తుల్లా తన ఆత్మకథ..‘ఇన్ పర్స్యూట్ ఆఫ్ డెమోక్రసీ: బియాండ్ పార్టీ లైన్స్‌’ను విడుదల చేశారు. ఈ సందర్భంగానే తన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న కీలక విషయాలని అందులో ప్రస్తావించారు. ఈ క్రమంలో 1999లో తాను కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలిగా ఉన్న సమయంలో ఆమెకు ఎదురైన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. “నేను 1999లో ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ (IPU) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి చెప్పడానికి ప్రయత్నించా. బెర్లిన్‌ నుంచి ఇండియాలో ఉన్న సోనియా గాంధీకి కాల్‌ చేశా. ఆ సమయంలో సోనియా సిబ్బంది ఫోన్‌ లిఫ్ట్‌ చేసి మేడమ్‌ బిజీగా ఉన్నారని చెప్పారు. దీంతో, బెర్లిన్ నుంచి కాల్ చేస్తున్నట్లు సిబ్బందికి తెలిపారు. వారు నన్ను ఫోన్ కాల్ లోనే వేచి ఉండాలని చెప్పారు. దీంతో, గంట పాటు ఫోన్‌ కాల్‌లోనే వేచి ఉన్నా. చివరికి సోనియాతో మాట్లాడకుండానే కాల్‌ కట్‌ చేశా” అని నజ్మా హెప్తుల్లా తెలిపారు. ఈ ఘటనే తనను కాంగ్రెస్‌ పార్టీకి దూరం చేసిందని అన్నారు. మరుసటి ఏడాది న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా సోనియాను ఆహ్వానించినప్పుడు ఆమె చివరి నిమిషంలో తప్పుకున్నారని తెలిపారు. ఆ సమయంలో తాను తిరస్కరణ భావానికి లోనైట్లు చెప్పుకొచ్చారు. అది ఇప్పటికీ తన మనసులో అలాగే ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

బీజేపీలో చేరిక..

అయితే, సోనియా గాంధీకి కాల్ చేసే ముందు.. తాను ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి సమాచారం అందించినట్టు నజ్మా చెప్పారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి ఆమెతో మాట్లాడి అభినందనలు చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో సోనియాపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ నాయకత్వ శైళి ఇందిరాగాంధీ ఆలోచనలకు భిన్నంగా ఉందన్నారు. పార్టీ నేతలంటే సోనియాకు చులకన భావమనే విధంగా ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా.. 2004 ఎన్నికల సందర్భంగా సోనియాతో విభేదాలు రావడంతో నజ్మా హెప్తుల్లా కాంగ్రెస్‌ను వీడారు. ఆ తర్వాత కాషాయకండువా కప్పుకున్నారు. ఆమె కాంగ్రెస్ సభ్యురాలిగా ఉన్నప్పుడు పదహారేళ్లపాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఇక, బీజేపీ ప్రభుత్వంలో 2014-2016 మధ్య కేంద్రమంత్రిగా పనిచేశారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిగా కొనసాగారు. అలాగే, 2016 నుండి 2024 మధ్య కాలంలో మూడు సార్లు ఆమె మణిపూర్ గవర్నర్‌గా పనిచేశారు. 2017 నుండి 2023 వరకు జామియా మిలియా ఇస్లామియా ఛాన్స్‌లర్‌గా ఉన్నారు. అంతేకాకుండా, బీజేపీ తరఫున ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయారు.

Advertisement

Next Story

Most Viewed