Kolkata Horror: పాలీగ్రాఫ్ టెస్టులో మాజీ ప్రిన్సిపల్ మోసపూరిత సమాధానాలు..!

by Shamantha N |
Kolkata Horror: పాలీగ్రాఫ్ టెస్టులో మాజీ ప్రిన్సిపల్ మోసపూరిత సమాధానాలు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాలలో జరిగిన జూనియర్‌ డాక్టర్‌ హత్యాచారం (Kolkata Doctor Rape and Murder) కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈకేసులో సీబీఐ దర్యాప్తు చేస్తుండగా రోజుకో ట్విస్ట్ బయటకొస్తుంది. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ఘోష్‌ మోసపూరిత సమాధానాలు ఇస్తున్నారని సీబీఐ పేర్కొంది. ఆయనకు పాలీగ్రాఫ్‌ టెస్టు, వాయిస్‌ అనాలిసిన్‌ నిర్వహించగా.. ముఖ్యమైన ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వట్లేదని సీబీఐ అధికారులు చెబుతున్నరు. విచారణలో భాగంగా సందీప్ కు పాలీగ్రాఫ్‌ టెస్టు, వాయిస్‌ అనాలసిస్‌ నిర్వహించారు. కాగా.. ఆయన చెప్పిన జవాబులు మోసపూరితమైనవని ఢిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ(CFSL) నివేదిక ఇచ్చినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. అయితే, పాలిగ్రాఫ్ సమాధానాలను సాక్ష్యాలుగా చూపిస్తే కోర్టు పరిగణలోకి తీసుకోదు. దీంతో, ఆ కేసుతో ముడిపడిన ఆధారాలను సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

సీబీఐ కస్టడీలో..

ఇకపోతే, సంజయ్ రాయ్‌ను రక్షించేందుకు తాలా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ అభిజిత్ మండల్ ప్రయత్నించారని సీబీఐ ఆరోపించింది. అలానే ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని హడావిడిగా దహనం చేశారని తెలిపింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదులో జాప్యం, సాక్ష్యాధారాలు తప్పుదోవపట్టించారనే ఆరోపణలతో ఎస్‌హెచ్‌ఓ మండల్‌ను డాక్టర్ సందీప్ ఘోష్‌తో పాటు సీబీఐ శనివారం అరెస్టు చేసింది. వీరిని కోర్టులో హాజరుపరచగా.. తాలా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓ అభిజిత్ మండల్ ను, మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను కలకత్తా హైకోర్టు ఈనెల 17 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించింది. హత్యాచార ఘటనపై ఆగస్టు 9న ఉదయం 9.58 గంటలకు సందీప్‌ఘోష్‌కు సమాచారం అందగా.. వెంటనే పోలీసులకు ఆయన ఫిర్యాదు చేయలేదని సీబీఐ పేర్కొంది. సందీప్‌ ఘోష్‌, తాలా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జి అభిజిత్‌ మండల్‌ను ఘటన వెలుగుచూసిన అనంతరం ఇద్దరూ ఒకరితో ఒకరు టచ్‌లో ఉన్నారని తెలిపింది. ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో మండల్‌కు సందీప్‌ సూచనలు చేసినట్లు సీబీఐ పేర్కొంది. ఘోష్‌, మండల్‌లు కలిసి నేరాన్ని కప్పిపుచ్చేందుకు యత్నించారని ఆరోపించింది. మరోవైపు, మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఘటనలో సందీప్ ఘోష్ ను సీబీఐ ఈనెల 2న అఱెస్టు చేసింది. ఆ తర్వాత సాక్ష్యాలు తారుమారు చేశారన్న అభియోగాలను ఆయనపై మోపింది.

Advertisement

Next Story

Most Viewed