కోల్ కతాను ముంచెత్తుతున్న వర్షాలు.. ఎయిర్ పోర్టు జలమయం

by Shamantha N |
కోల్ కతాను ముంచెత్తుతున్న వర్షాలు.. ఎయిర్ పోర్టు జలమయం
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ లో అల్పపీడనం కారణఁగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. కోల్‌కతాలో ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. భారీ వర్షాలకు కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నీటితో నిండిపోయింది. దీంతో భారీ ఎత్తున విమానాశ్రయంలో నీళ్లు నిలిచిపోయాయి. ఎయిర్‌పోర్టులో నీళ్లు నిలిచినా విమాన సర్వీసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫుటేజీలో రన్‌వే,టాక్సీవేలు రెండూ జలమయమయ్యాయి. హౌరా, సాల్ట్ లేక్, బరాక్ పురాలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. అల్పపీడనం కాస్తా తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణశాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ జిల్లాలపై దీని ప్రభావం కనిపించనుంది. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఐఎండీ హెచ్చరికలు

కోల్ కతా సహా హౌరా, పశ్చిమ్ బర్ధమాన్, బీర్భూమ్, పుర్బా బర్ధమాన్, హుగ్లీ, నదియా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలతో సహా దక్షిణాది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. 11 సెంటీమీటర్ల వరకు భారీ వర్షం కురుస్తుందంది. ఆ ప్రాంతాలకు ‘ఎల్లో’ అలర్ట్ ప్రకటించింది. పురూలియా, ముర్షిదాబాద్, మాల్దా, కూచ్‌బెహార్, జల్‌పైగురి, డార్జిలింగ్, కాలింపాంగ్ జిల్లాలకు ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది. అలీపుర్‌దూర్ జిల్లాకు మాత్రం ‘రెడ్’ అలర్ట్‌ను ప్రకటించింది. 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

Advertisement

Next Story