KC Venu Gopal : ‘కేరళ మినీ పాకిస్తాన్’ అంటూ వ్యాఖ్యలు.. కేసీ వేణుగోపాల్ రియాక్షన్ ఇదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2024-12-31 14:56:01.0  )
KC Venu Gopal : ‘కేరళ మినీ పాకిస్తాన్’ అంటూ వ్యాఖ్యలు.. కేసీ వేణుగోపాల్ రియాక్షన్ ఇదే..!
X

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ విద్వేష మూకలను నియమించి కేరళకు వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. ‘కేరళ మినీ పాకిస్తాన్’ అంటూ మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణే చేసిన వ్యాఖ్యలను ఆయన మంగళవారం తీవ్రంగా ఖండించారు. ‘ఎక్స్’ వేదికగా ఆయన ఈ మేరకు స్పందించారు. ‘బీజేపీ విద్వేష మూకలను నియమించి కేరళపై విషం చిమ్ముతోంది. ‘మిని పాకిస్తాన్’ లాంటి పదాలను వాడి రాష్ట్ర ప్రజలను శత్రువులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోడీ నితీశ్ రాణేను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలి. ఇలాంటి రాజకీయాల కారణంగా కేరళ ప్రజలు బీజేపీని తిరస్కరిస్తూ వస్తున్నారు. ఇక్కడి ప్రజలు సామరస్యంగా జీవించడాన్ని బీజేపీ ఎన్నటికీ అర్థం చేసుకోలేదు.’ అని ఆయన అన్నారు. అయితే సోమవారం మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణే మాట్లాడుతూ.. కేరళను ‘మినీ పాకిస్తాన్’ అని పోల్చారు. అందుకే ప్రియాంక, రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలుపొందరన్నారు. ప్రతిపక్షాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టడంతో నితీశ్ రాణే క్లారిటీ ఇచ్చారు. పరిస్థితులను వివరించేందుకు తాను కేరళను పాకిస్తాన్‌తో పోల్చినట్లు తెలిపారు.

Advertisement

Next Story