వాట్స‌ప్‌లో అలాంటి పోస్ట్ పెట్టినందుకే ఆ యువ‌తి అరెస్ట్‌!

by Sumithra |
వాట్స‌ప్‌లో అలాంటి పోస్ట్ పెట్టినందుకే ఆ యువ‌తి అరెస్ట్‌!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః స్థానికంగానే సామ‌ర‌స్య‌త క‌నుమ‌రుగ‌వుతున్న స‌మ‌యంలో ఓ యువ‌తి పాకిస్థాన్ రిపబ్లిక్ డే సందర్భంగా ప్ర‌పంచ ప్రజలంద‌రికీ శుభాకాంక్షలు తెలిపింది. కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో 25 ఏళ్ల యువ‌తి ఇదేదో దేశ‌ద్రోహ చ‌ర్య‌కు పాల్పిడిన‌ట్లు పోలీసులు అరెస్టు చేశారు. కుత్మా షేక్ అనే మహిళ ముధోల్ పట్టణంలో నివాసం ఉంటూ స్థానిక మదర్సాలో విద్యాభ్యాసం చేస్తోంది. అయితే, ఈమె మార్చి 23న రిప‌బ్లిక్ డే జ‌రుపుకుంటున్న పాకిస్థాన్‌ను ఉద్దేశించి, "దేవుడు ప్రతి దేశాన్ని శాంతి, ఐక్యత, సామరస్యంతో ఆశీర్వదిస్తాడు" అంటూ వాట్స‌ప్ స్టేట‌స్ పెట్టింది. 'హ‌వ్వ‌..! ఎంత దారుణం. శ‌త్రు దేశానికి శుభాకాంక్ష‌లు తెలుపుతుందా..?! మ‌హా పాపానికి ఒడిగ‌ట్టింది..' అనుకున్నాడో ఏమోగానీ, అరుణ్ కుమార్ భజంత్రీ అనే కార్యకర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఏదైనా పౌర ర‌క్ష‌ణ‌కు వెనుదీయ‌ని పోలీసులు మార్చి 24న కుత్మా షేక్‌ను నిర్మొహ‌మాటంగా అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అయితే, ఒక రోజు తర్వాత ఆమె బెయిల్‌పై విడుదలైంది.

ఇక‌, ఈ భజంత్రీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, 'కుత్మా షేక్ అనే యువ‌తి క‌మ్యూనిటీల మ‌ధ్య శత్రుత్వం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, వ‌ర్గ‌వైష‌మ్యాల‌ను రెచ్చ‌గొడుతోందిని, ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు. త‌క్ష‌ణ‌మే స్పందించిన పోలీసులు ఆమెపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153(ఎ) (మతం, జాతి మొదలైన వాటి ఆధారంగా సమూహాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించడం), 505 (2) (గుంపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే ప్రకటనలు) కింద కేసు నమోదు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఆమెను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆన‌క‌, పోలీసుల‌కు హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల నుంచి అక్షింత‌లు త‌ప్ప‌లేదు. మ‌రి కోర్టు ఏమంటుందో వేచి, చూడాలి.

అయితే, పాకిస్థాన్ జాతీయ దినోత్స‌వానికి భార‌త ప్ర‌ధాని మోడీ పాకిస్థాన్ ప్ర‌ధానికి పెట్టిన శుభాకాంక్ష‌ల ట్వీట్‌ను ఉటంకిస్తూ కొంద‌రు నెటిజ‌న్లు క‌ర్నాట‌క పోలీసుల అత్యుత్సాహాన్ని విమ‌ర్శిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed