Siddaramaiah: కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

by Shamantha N |   ( Updated:2024-11-23 11:48:25.0  )
Siddaramaiah: కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. కర్ణాటకలోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. శిగ్గావ్‌, సండూరు, చెన్నపట్నలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. కర్ణాటకలోని చెన్నపట్నలో జేడీఎస్‌ అభ్యర్థి, మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ కుమారస్వామిపై.. కాంగ్రెస్ అభ్యర్థి సీపీ యోగేశ్వర ఘన విజయం సాధించారు. అదే విధంగా శిగ్గావ్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై కుమారుడు భరత్ బొమ్మై ఓటమి పాలయ్యారు. భరత్ బొమ్మపై కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ విజయం సాధించారు. కాగా.. ఉపఎన్నిక గెలుపుపై కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్(Deputy Chief Minister D K Shivakumar) స్పందించారు. ‘గెలుపునకు కాంగ్రెస్ హామీలు, సిద్ధరామయ్య నాయకత్వం, కార్యకర్తలు, ఎమ్మెల్యేలే కారణం. ఎన్నికల్లో నిఖిల్ గానీ, భరత్ బొమ్మై ఓడిపోలేదు. నిజానికి ఇది బసవరాజ్ బొమ్మై, కుమారస్వామి ఓటమి. ఈ విజయంతో కర్ణాటక అసెంబ్లీలో అధికార పార్టీ సంఖ్య 138కి చేరింది.’ అని శివకుమార్ చెప్పుకొచ్చారు.

గెలుపు అద్భుతం- సిద్ధరామయ్య

కర్ణాటక ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయంపై సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) హర్షం వ్యక్తం చేశారు. మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థుల్ని గెలిపించిన ప్రజలకు ‘ఎక్స్‌’ వేదికగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. విపక్షాలు నిరంతరం దూషణలు, తప్పుడు ఆరోపణలను తట్టుకుని నిలబడి సాధించిన ఈ విజయం అద్భుతమని అన్నారు. గెలుపునకు కృషిచేసిన కార్యకర్తలు, నేతలను ఆయన అభినందించారు. ఈ విజయంతో ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రజల కోసం పనిచేయాలనే తమ సంకల్పాన్ని ఈ ఫలితాలు మరింత బలోపేతం చేస్తున్నాయన్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శిగ్గావ్‌లో బీజేపీ అభ్యర్థి బసవరాజ బొమ్మై, చెన్నపట్నలో జేడీఎస్‌ అభ్యర్థి కుమారస్వామి, సండూరులో కాంగ్రెస్‌ అభ్యర్థి తుకారాం అప్పట్లో గెలిచారు. ఈ ముగ్గురూ 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి తమ ఎమ్మెల్యే స్థానాలకు రాజీనామా చేశారు. దీంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే, ఉపఎన్నికల్లో గతంలో గెలిచిన స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు మరో రెండు స్థానాలను హస్తంపార్టీ తన ఖాతాలో వేసుకుంది.


Read More..

Kishan Reddy: కాంగ్రెస్ విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు

Advertisement

Next Story

Most Viewed