Pakistan : ‘షాంఘై’ సదస్సు.. జాకిర్ నాయక్ పాకిస్తాన్ పర్యటనలపై భారత్ కీలక ప్రకటన

by Hajipasha |
Pakistan : ‘షాంఘై’ సదస్సు.. జాకిర్ నాయక్ పాకిస్తాన్ పర్యటనలపై భారత్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీ‌ఓ) సదస్సు ఈనెల 15, 16 తేదీల్లో పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా జరగనుంది. దీనికి హాజరుకానున్న భారత ప్రతినిధుల బృందానికి విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సారథ్యం వహించనున్నారు. ఈవిషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం వెల్లడించారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌‌‌లోని సభ్యదేశాల ప్రభుత్వాధినేతల మండలి సమావేశంలో భారత ప్రతినిధి బృందం పాల్గొననుంది.

ఇటీవలే అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాకిస్తాన్‌పై జైశంకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కశ్మీర్‌ను పాలస్తీనాతో పోలుస్తూ పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పాకిస్తాన్ జీడీపీని తీవ్రవాదం రూపంలో కొలవాల్సిన దుస్థితి ప్రస్తుతం నెలకొందని జైశంకర్ గుర్తుచేశారు. పాకిస్తాన్ తన కర్మల ఫలాన్నే అనుభవిస్తోందని దుయ్యబట్టారు.

జాకిర్ నాయక్ పాక్ పర్యటన ఆశ్చర్యపరిచే విషయమేం కాదు

మనీలాండరింగ్ కేసులో భారత దర్యాప్తు సంస్థల వాంటెడ్ లిస్టులో ఉన్న వివాదాస్పద మత ప్రబోధకుడు జాకిర్ నాయక్ పాకిస్తాన్ పర్యటనపైనా భారత్ స్పందించింది. జాకిర్ పాకిస్తాన్ పర్యటన విస్మయానికి గురి చేసిందని, అయితే అది ఆశ్చర్యపరిచే విషయమేం కాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. అతడు పాకిస్తాన్‌లో పర్యటించడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed