ఇండియా కూటమి క్యాన్సర్ కంటే డేంజర్.. ప్రధాని మోడీ ఫైర్

by Satheesh |
ఇండియా కూటమి క్యాన్సర్ కంటే డేంజర్.. ప్రధాని మోడీ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పార్లమెంట్ ఎన్నికల కోలాహాలం కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటి వరకు ఐదు ఫేజ్‌లు కంప్లీట్ అయ్యాయి. మరో రెండు దశల ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అగ్రనేతలు చివరి దశలోనూ ఏ మాత్రం తగ్గకుండా ప్రచారం హోరెత్తిస్తున్నారు. బీజేపీ అగ్రత్రయం మోడీ, అమిత్ షా, నడ్డా వంటి నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రత్యర్థి ఇండియా కూటమిపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రధాని మోడీ దేశంలోనే అత్యధిక పార్లమెంట్ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఇండియా కూటమి క్యాన్సర్ వ్యాధి కంటే ప్రమాదకరమని... అది వ్యాప్తిస్తే దేశాన్ని మళ్లీ నాశనం చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూట‌మికి మ‌త‌త‌త్వం, జాతి వివ‌క్ష, బంధుప్రీతి వంటి జబ్బులు ఉన్నాయని.. ఇవి ప్రాణాంతక క్యాన్సర్ కంటే డేంజరని మోడీ విరుచుకుపడ్డారు.

దేశంలో మళ్లీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే భారత్ అభివృద్ధిలో వెనక్కి పోతుందని నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు వారసత్వ నాయకులు (అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ) అబద్ధాల ప్రచారంతో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి బయలుదేరారని ఫైర్ అయ్యారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. బీజేపీ ప్రభుత్వం ప్రారంభించిన 50 కోట్లకు పైగా జ‌న్ ధ‌న్ ఖాతాల‌ను మూసివేసి ఆ డ‌బ్బును లాగేసుకుంటార‌ని, ప్రతి గ్రామానికి బీజేపీ కల్పించిన విద్యుత్ క‌నెక్షన్లను క‌ట్ చేసి మ‌ళ్లీ చీకట్లోకి తీసుకు వెళ్తారని నిప్పులు చెరిగారు. దేశాన్ని 60 ఏండ్లు పాలించి ఏ పని చేయని వారు ఇప్పుడు మళ్లీ తనను అడ్డుకునేందుకు ఏకమయ్యారని.. ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పాలని మోడీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Advertisement

Next Story