Parliament Session: విపక్షాల ఆందోళనలు.. బడ్జెట్ లో వివక్ష అని నినాదాలు

by Shamantha N |
Parliament Session: విపక్షాల ఆందోళనలు.. బడ్జెట్ లో వివక్ష అని నినాదాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: విపక్షాల ఆందోళనల మధ్యే పార్లమెంటు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌లో రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని పార్లమెంటు ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టాయి. ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై బడ్జెట్ లో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా ఇతర ఇండియా కూటమి ఎంపీలు, ప్రతిపక్షపార్టీల ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాన హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వెలుపల నిరసన తెలిపారు.

ప్రతిపక్షాలు ఏమన్నాయంటే?

కేంద్ర బడ్జెట్‌ వల్ల ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు మాత్రమే లబ్ధి జరిగిందని మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. "చాలా మందికి బడ్జెట్‌లో న్యాయం జరగలేదు. మేం న్యాయం కోసం పోరాడుతున్నాం. ఈ బడ్జెట్ కేవలం వారి మిత్రపక్షాలను సంతృప్తి పరచడానికి మాత్రమే. వారు ఎవరికీ ఏమీ ఇవ్వలేదు" అని ఖర్గే అన్నారు. బడ్జెట్‌పై రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే నిరసన తెలిపారు. ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని, ఎవరికీ న్యాయం జరగలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడారని, కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని.. ఇదో మోసపూరిత బడ్జెట్ అని మండిపడ్డారు. ప్రజలకు అన్యాయం చేశారని అన్నారు. బడ్జెట్‌పై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. రైతులు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు బదులుగా, తమ ప్రభుత్వాన్ని కాపాడుతున్న సంకీర్ణ భాగస్వామ్య పక్షాలకు మద్దతు ఇచ్చారని మండిపడ్డారు. ద్రవ్యోల్బణం తగ్గించే చర్యలు లేవని అన్నారు. ఉత్తరప్రదేశ్‌కు ఏమీ రాలేదని.. డబుల్ ఇంజన్ ప్రభుత్వం నుండి యూపీకి రెట్టింపు ప్రయోజనం లభించాలని అన్నారు. కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్నారు. లక్నో, ఢిల్లీ ప్రజలకు కోపం తెప్పించారని అన్నారు.

సభకు అంతరాయం కలిగించొద్దన స్పీకర్

ప్రశ్నోత్తరాల సమయానికి అంతరాయం కలిగించవద్దని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla) విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. నిరసనలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఎంపీ చేసిన పని ఖండించాల్సిన విషయమన్నారు. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల నేతలు మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం సభను నడపాలని, సజావుగా సాగాలని సూచించారని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు రచ్చ చేస్తున్నామని నిప్పులు చెరిగారు.

Advertisement

Next Story

Most Viewed