Illegal land allotment: కర్ణాటక ముడా స్కాంలో బయటకొస్తున్న సంచలనాలు

by Shamantha N |
Illegal land allotment: కర్ణాటక ముడా స్కాంలో బయటకొస్తున్న సంచలనాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: క‌ర్ణాట‌క ముడా స్కామ్‌(Illegal Land Allotment)లో సంచలనాలు బయటకొస్తున్నాయి. కడూరు, ముడిగేరి తాలూకాల్లో సుమారు ప‌ది వేల ఎక‌రాల స్థ‌లాన్ని అక్ర‌మంగా కేటాయించినట్లు దర్యాప్తులో తేలింది. కాగా.. ఈ కేసులో ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ద‌రామ‌య్య విచార‌ణ ఎదుర్కొంటున్నారు. అయితే ద‌ర్యాప్తు రిపోర్టు ప్ర‌కారం అక్క‌డి స్థ‌లాన్ని ఆరుగురు మాజీ ఎమ్మెల్యేల‌కు కేటాయించిన‌ట్లు తెలిసింది. వారితో పాటు మ‌రో 326 మంది అధికారులు కూడా భూమి తీసుకున్న‌వారిలో ఉన్నారు. అక్ర‌మ కేటాయింపుల‌కు రెగ్యుల‌రైజేష‌న్ క‌మిటీ బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని నివేదికలో తేలింది.

కడూరు ఎంపీ, ఎమ్మెల్యేలు

క‌డూరు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేలు వైఎస్వీ ద‌త్త‌, బెల్లి ప్ర‌కాశ్, ముడిగేరి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌తినిధులు మోత‌మ్మ‌, ఎంపీ కుమార‌స్వామి, బీబీ నింగ‌య్య పేర్లు కూడా ఈ కేసుతో ముడిపడి ఉన్నాయి. ప్ర‌భుత్వం నియ‌మించిన 13 మంది త‌హశీల్దార్లు ఇచ్చిన నివేదిక‌లో వారందరి పేర్లు ఉన్నాయి. చిక్క‌మంగుళూరుకు చెందిన సీటీ ర‌వి పేరు కూడా ఉన్న‌ది. అక్రమ భూమి కేటాయింపుల్లో 326 మంది అధికారుల్లో.. 23 మంది త‌హిసిల్దారులు, 18 షిర‌స్తేదార్లు, 48 మంది రెవ‌న్యూ ఇన్‌స్పెక్ట‌ర్లు, 104 మంది విలేజ్ ఆఫీస‌ర్లు ఉన్నారు. మొత్తం 10,598 ఎక‌రాల భూమిని అక్ర‌మంగా కేటాయించిన‌ట్లు రిపోర్టులో తెలిపారు. 6248 ఎక‌రాల స్థ‌లాన్ని అన‌ర్హులకు ఇచ్చినట్లు తెలిసింది.

Next Story

Most Viewed