BJP Deeksha: సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు

by Y.Nagarani |
BJP Deeksha: సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రైతులకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ తలపెట్టిన 24 గంటల దీక్షను మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. సీఎం రేవంత్ హామీల అమలు విషయంలో చిలక పలుకులు పలుకుతున్నారని, అవి ఆయన గౌరవాన్ని తగ్గిస్తాయే తప్ప.. పెంచవన్నారు. వ్యవసాయం చేస్తున్న రైతులంతా తమకు ఇచ్చిన హామీలను ఎప్పుడెప్పుడు నెరవేరుస్తారా అని ఎదురుచూస్తున్నారన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇస్తామని చెప్పిన రూ.2 లక్షలను వెంటనే వారి అకౌంట్లలో వేయాలని డిమాండ్ చేశారు. ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువమంది రైతులుంటే ఒక్కరికే రైతు రుణమాఫీ వర్తిస్తుందన్న నియమాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు.

రైతులని నమ్మించి మోసం చేస్తే.. అదే ప్రజాక్షేత్రంలో రైతులే నిన్ను బొందపెడతారు అంటూ.. ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం హైడ్రాపై కూడా ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు చేశారు. కోర్టు చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని.. మూసీ ప్రక్షాళన, కూల్చివేతలు తమ నిర్ణయాలు కాదని అధికారులే తప్పించుకుంటున్నారన్నారు. ఒడ్డు ఎక్కేవరకూ ఓడ మల్లప్ప.. ఒడ్డు ఎక్కినంక బోడ మల్లప్ప అనే వైఖరిని రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్నారన్నారు. ప్రజలు మరోసారి రేవంత్ ను నమ్మి మోసపోరన్నారు. ఇదంతా రేవంత్ రెడ్డి చేస్తున్నదేనని, ప్రజల మీద ప్రేమ, చట్టం మీద నమ్మకం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed