Muda 'scam' row: రాజకీయ విద్వేషాలు, కుట్రలకు ఆమె బాధితురాలు.. భార్య గురించి సిద్ధరామయ్య వ్యాఖ్యలు

by Shamantha N |
Muda scam row: రాజకీయ విద్వేషాలు, కుట్రలకు ఆమె బాధితురాలు.. భార్య గురించి సిద్ధరామయ్య వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ముడా (MUDA)’ స్కాం వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) భార్య పార్వతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై సిద్ధరామయ్య స్పందించారు. రాజకీయ విద్వేషాలు, కుట్రలకు తన భార్య బాధితురాల అయ్యిందని ఆవేదన చెందారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు. ‘‘ముడా స్థలాల కేటాయింపులో భాగంగా మాకు వచ్చిన భూములను నా భార్య పార్వతి తిరిగిచ్చేసింది. ప్రతిపక్షాల తప్పుడు ఫిర్యాదులతో నా ఫ్యామిలీని వివాదాల్లోకి లాగారు. ఈ విషయం కన్నడ ప్రజలకు కూడా తెలుసు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలన్నదే నా సిద్ధాంతం. కానీ, నాపై జరుగుతున్న రాజకీయ కుట్రలు చూసి నా భార్య ఆవేదన చెందింది. అందుకే భూములను తిరిగి ఇచ్చేసింది. ఆమె నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా. నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా.. కుటుంబ బాధ్యలకు పరిమితమైన నా భార్య ఇలాంటి విద్వేషాలకు బలై మానసిక క్షోభ అనుభవిస్తోంది.’’ అని సిద్ధరామయ్య (Karnataka CM Siddaramaiah) సుదీర్ఘ పోస్ట్‌ చేశారు.

సిద్ధరామయ్య భార్య లేఖ

ఇకపోతే, సోమవారం సిద్ధరామయ్య భార్య పార్వతి ఓ లేఖ విడుదల చేశారు. ‘ముడా’కు చెందిన 14 ప్లాట్లు తిరిగి అదే సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అవినీతి మచ్చలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న ప్లాట్లను ఇచ్చేస్తున్న అని వెల్లడించారు. ‘‘మా అన్నయ్య పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఈ ప్లాట్లు ఇంత రాద్దాంతం చేస్తాయని అనుకోలేదు. నా భర్త గౌరవానికి మించి ఈ ఆస్తులు ఎక్కువ కాదు. ఇన్నేళ్లు ఆయన అధికారం నుంచి ఏమీ ఆశించని మాకు ఈ ఆస్తులు ఓ లెక్క కాదు. అందుకే ఈ స్థలాలు తిరిగి ఇచ్చేస్తున్నా. ఈ విషయంలో నా భర్త అభిప్రాయం తెలియదు. నా ఫ్యామిలీతో చర్చించకుండా తీసుకున్న నిర్ణయమిది. ఆరోపణళు వచ్చిన రోజే ఈ నిర్ణయం తీసుకోవాలనుకున్నా. రాజకీయ కుట్రలో నా భర్త మరింత నష్టపోతున్నాడనే ఈ నిర్ణయం తీసుకున్నా. అసరమైతే విచారణకు కూడా సహకరిస్తా. రాజకీయాలకు దూరంగా ఉండే నా లాంటి మహిళలను వివాదాల్లోకి లాగొద్దు’ అని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed