సర్కార్ భూమిలో ‘పావని ఫెలిసిటీ’ పాగా..? నిర్మాణానికి అనుమతులు!

by Shiva |
సర్కార్ భూమిలో ‘పావని ఫెలిసిటీ’ పాగా..? నిర్మాణానికి అనుమతులు!
X

దిశ, మేడ్చల్ బ్యూరో: ‘హై ఎండ్.. సిటీ ట్రెండ్‌గా మారింది. నగరం నలువైపులా ఆకాశమే హద్దుగా వెలిసే హైరేజ్ అపార్ట్‌మెంట్లు, విశాలమైన విల్లాలతో భాగ్యనగరం అంతర్జాతీయ హంగులను సంతరించుకుంటోంది. బడా కార్పొరేట్ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారింది. అయితే, కొన్ని బడా రియల్ ఏస్టేట్ సంస్థలు ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నాయి. కస్టమర్లకు రకరకాల మాయమాటలలు చెప్పి బురిడీ కొట్టించి ప్లాట్లను అంటగడుతున్నాయి. బాచుపల్లి మండల పరిధిలో ప్రముఖ వాసవీ అర్డన్ నిర్మాణ సంస్థ చెరువు కోమటికుంట ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఆకాశాన్ని తలదన్నేలా రెండు భారీ అపార్ట్‌మెంట్లను నిర్మించింది. అదేవిధంగా నిజాంపేటలోని సర్వే నెం.334లోని ప్రభుత్వ భూమిని కొంత మేర ఆక్రమించి ‘పావని ఫెలిసిటీ’ నిర్మాణ సంస్థ హైరేజ్ అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజాంపేటలో మరో తప్పిదం..

నిజాంపేట గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నెం.331లో 2.5 ఎకరాల భూమిలో పావని ఫెలిసిటీ పేరిట హైరేజ్ నిర్మాణం కోసం అనుమతులు తీసుకుంది. రెండు సెల్లార్లు, ఒక స్టిల్ట్, 23 అంతస్తులు‌తో పాటు ఓ టెర్రస్ గార్డెన్ కోసం పనులు కొనసాగుతున్నాయి. కాగా సర్వే నెం.331‌కు అనుకుని ఉన్న ప్రభుత్వ భూమి అయిన సర్వే నెం.334‌లో కూడా కొంత భూమిలో ఆ సంస్థ నిర్మాణాలను చేపడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వే నెం.331లో 4 ఎకరాల 34 గుంటల భూమి ఉండగా.. వాటిని 2.17 ఎకరాల చొప్పున రెండు సబ్ డివిజన్లుగా విక్రయించారు. ఇప్పటికే ఒక సబ్ డివిజన్‌కు సంబంధించిన 2.17 ఎకరాల భూమిలో నిర్మాణాలు పూర్తి కాగా.. మరో 2.17 ఎకరాల భూమిలో పావనీ ఫెలిసిటీ హైరేజ్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఆ సంస్థ చేపడుతోన్న భావన నిర్మాణం కొంత భాగం ప్రభుత్వ భూమిలోకి వస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం..

నిజాంపేటలోని సర్వే నెం.334లో ఉన్న ప్రభుత్వ భూమి చాలా వరకు కబ్జాకు గురైంది. మరికొంత భూమిలో నిర్మాణాలు కూడా వెలుస్తున్నాయి. ఇదే సర్వే నెంబర్‌లో కొంత భూమి తమదిగా పేర్కొంటూ మరికొందరు కోర్టును ఆశ్రయించారు. 34 ఎకరాల 5 గుంటల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూమి ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం.. రూ. వందల కోట్లు విలువ చేస్తుంది. ఈ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం‌పై ఉందని ఆ విషయంపై ఇప్పటికే బాచుపల్లి తాహసీల్దార్‌కు పలువురు ఫిర్యాదు చేశారు.

మావి అన్ని సరిగ్గానే ఉన్నాయి

ప్రభుత్వ భూమిని కలుపుకుని నిర్మాణం చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను పావని ఫెలిసిటీ సెంటర్ భవన నిర్మాణ సైట్ ఇం‌చార్జీ కృష్ణ ఖండించారు. నిర్మాణం జరుగుతున్న భూమిని ఒకటికి రెండు సార్లు సర్వే చేయించామని, అన్ని శాఖల అధికారులు క్లియరెన్స్ ఇచ్చిన తరువాతే పనులను ప్రారంభించామని స్పష్టం చేశారు. కాగా నిర్మాణ సంస్థ చేపడుతున్న భవన నిర్మాణ అనుమతులకు, మ్యాప్‌కు తేడాలున్నాయని ‘దిశ’ ప్రతినిధి ప్రశ్నించగా.. కృష్ణ సమధానాన్ని దాట వేశారు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

నిజాంపేట సర్వే నెం.334లోని ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణ సంస్థ పనులు చేపడుతుందన్న విషయం దృష్టికి వచ్చింది. ఈ విషయంపై మండల సర్వేయర్ చేత రీసర్వే చేపించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం సిబ్బంది లేక్స్ సర్వేలో బిజీగా ఉన్నారని వీలైనంత త్వరగా పరిశీలించి ఒకవేళ ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -పూల్ సింగ్, బాచుపల్లి తాహసీల్దార్

Next Story

Most Viewed