తమ ముందు హాజరు కావాలని కాంగ్రెస్ నేతకు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు

by Harish |
తమ ముందు హాజరు కావాలని కాంగ్రెస్ నేతకు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలాకు హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ తాజాగా సమన్లు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నాయకురాలు హేమమాలినిపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడానికి ఏప్రిల్ 18న తమ ముందు హాజరు కావాలని మహిళా కమిషన్ సమన్లు పంపింది. కాంగ్రెస్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఇలాంటివి సరికాదని కమిషన్ పేర్కొంది. ఇటీవల రణదీప్ సింగ్ సూర్జేవాలా హేమమాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియా ఒక వీడియోను షేర్ చేయగా ఈ వివాదం తలెత్తింది. అలాగే, వెంటనే బీజేపీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

అయితే ఈ వివాదంపై రణదీప్ స్పందించారు. బీజేపీ ఎంపీని కించపరచాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, తాను ఆమెను గౌరవిస్తానని, తన ప్రసంగంలోని కొన్ని మాటలను తీసుకుని వాటిని వక్రీకరిస్తున్నారని చెప్పారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కంగనా రనౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం కూడా రణదీప్ సూర్జేవాలాపై కఠిన వైఖరిని తీసుకుంది. అసభ్యకరమైన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Advertisement

Next Story