Bangladesh: ఉద్రిక్తతల వేళ కేంద్రం కీలక నిర్ణయం

by Shamantha N |
Bangladesh: ఉద్రిక్తతల వేళ కేంద్రం కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: పొరుగుదేశం బంగ్లాలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ ఉద్రిక్తతల దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. బంగ్లాలోని భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత వరకు బయటకు రావొద్దని సూచించింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బంగ్లాదేశ్‌కు వెళ్లవద్దని భారతీయ పౌరులు ఖచ్చితంగా సూచిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. ఢాకాలోని భారత హైకమిషన్‌తో ఎల్లప్పుడూ టచ్‌లో ఉండాలని అడ్వైజరీ జారీ చేశారు. ఇకపోతే, బంగ్లాదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో భద్రతాబలగాలు, నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 14 మంది పోలీసులు సహా 100 మంది చనిపోయారని ఢాకా వర్గాలు తెలిపాయి.

ప్రధాని హసీనా రాజీనామా చేయాలని డిమాండ్

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యవస్థపై తలెత్తిన గందరగోళంపై నిరసనలు చెలరేగాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం నిర్వహించిన సహాయ నిరాకరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిరసనకారులు వచ్చారు. అవామీ లీగ్, ఛత్ర లీగ్, జుబో లీగ్ కార్యకర్తలు వారిని వ్యతిరేకించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నిరసనలో వంద మంది చనిపోగా.. వందలాది మంది గాయపడ్డారు. హింసాత్మక ఘటనలు మరింత ఉద్రిక్తం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, దేశవ్యాప్తంగా నిరవధికంగా కర్ఫ్యూ విధించారు.

Advertisement

Next Story