- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉక్రెయిన్ యుద్ధం ముగిసే చాన్స్!.. ఉక్రెయిన్ సైనికుల కోసం రష్యా అధ్యక్షుడి హామీ

దిశ, నేషనల్ బ్యూరో: మూడేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్(Ukraine), రష్యా(Russia) యుద్ధం ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) కూడా అంగీకరించే చాన్స్ ఉన్నదని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పేర్కొన్నారు. అదే విధంగా ఉక్రెయిన్ సైనికులు బలహీనమైన స్థితిలో ఉన్నారని, వారిని ప్రాణాలతో వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. పుతిన్‌తో డొనాల్డ్ ట్రంప్ ఫోన్ లో సంభాషించారు. ఆ తర్వాత తన ట్రుత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తన చర్చలు ఫలప్రదమయ్యాయని వివరించారు.
ప్రాణాలతో వదిలిపెట్టండి..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నిన్న ఫలప్రదంగా చర్చలు జరిగాయి. ఈ రక్తపాత, దారుణమైన యుద్ధం ముగిసిపోవడానికి చాన్స్ ఉన్నది. ప్రస్తుతం ఈ క్షణంలో వేలాది ఉక్రెయిన్ సైనికులను రష్యా మిలిటరీ చుట్టుముట్టుంది. వారిప్పుడు బలహీన స్థితిలో ఉన్నారు. ఆ ఉక్రెయిన్ సైనికులను ప్రాణాలతో వదిలిపెట్టాలని బలంగా పుతిన్‌ను కోరుతున్నాను. లేదంటే.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత హింసాపాత ఘటనగా చరిత్ర నిలుస్తుంది. అందరికీ ఆ దేవుడి దయ ఉండాలి’ అని తెలిపారు. 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా.. ఉక్రెయిన్ ముందుంచింది. దీనికి ఉక్రెయిన్ అంగీకరించిన తర్వాత అదే ప్రతిపాదనను రష్యాకు పంపింది. అమెరికా దౌత్యవేత్త స్టీవ్ విట్కోఫ్ 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పంద ప్రతిపాదనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వివరించారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పుతిన్ సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్టు తెలిపారు. అయితే.. ఇంకా పలు అంశాలపై స్పస్టత కావాలని, కండీషన్లపైనా చర్చించాల్సిన అవసరమున్నదని వివరించారు. ఒప్పందం కుదిరిన తర్వాత దాన్ని అమలును పర్యవేక్షించేదెవరు? ఉల్లంఘిస్తే శిక్షించేదెవరు? అని అడిగారు. ఒక్కసారి ఒప్పందం అమల్లోకి వస్తే అది శాశ్వత శాంతికి పునాదిగా నిలవాలని, అసలు ఈ యుద్ధానికి మూలకారణాలనూ ఈ డీల్ చర్చించాలని కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోనూ మాట్లాడాల్సి ఉన్నదని గురువారం చెప్పారు. కాగా, శుక్రవారం ట్రంప్ స్పందిస్తూ.. పుతిన్‌తో చర్చలు ఫలప్రదంగా సాగాయని వివరించారు.
ప్రధాని మోడీకి థాంక్స్
రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్ ఘర్షణను ముగించడానికి గొప్ప ప్రయత్నం చేసిన దేశాధినేతలందరికీ తన ధన్యవాదాలని పేర్కొన్నారు. ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు థాంక్స్ అని, అలాగే.. చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు దక్షిణాఫ్రికా రిపబ్లిక్ అధ్యక్షుడికి ధన్యవాదాలని, వీరంతా ఈ సమస్య తొలగిపోవాలని ప్రయత్నించారని తెలిపారు. ప్రధాని మోడీ ఫిబ్రవరిలో అమెరికా పర్యటనలో ఉన్నప్పుడూ ట్రంప్ పక్కన ఉండగా మీడియాతో మాట్లాడుతూ తాము ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో తటస్థంగా లేమని, తాము శాంతి వైపు నిలిచామని వివరించారు. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కృషికి తాము మద్దతిస్తున్నామని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ సైనికుల కోసం రష్యా అధ్యక్షుడి హామీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విజ్ఞప్తికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా స్పందించారు. వేలాది మంది ఉక్రెయిన్ సైనికులను రష్యా సైనికులు చుట్టుముట్టారని, వారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఆ ఉక్రెయిన్ సైనికులు సరెండర్ అయితే వారి ప్రాణాలకు తాను హామీ ఇస్తున్నానని వివరించారు. ట్రంప్ విజ్ఞప్తికీ.. అదీ ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలను కాపాడుతానని పుతిన్ హామీ ఇవ్వడం యుద్ధ విరమణకు బలమైన సంకేతంగా భావిస్తున్నారు.