వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల మధ్య రికార్డు స్థాయికి బంగారం ధరలు

by S Gopi |   ( Updated:2024-07-17 09:55:56.0  )
వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల మధ్య రికార్డు స్థాయికి బంగారం ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుముఖం పడతాయనే అంచనాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మంగళవారం రికార్డు స్థాయికి ఎగబాకాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రభావంతో మన దేశంలోనూ పసిడికి డిమాండ్ పెరిగింది. సెప్టెంబర్‌లో అమెరికా వడ్డీ రేట్లలో కోత విధిస్తే దేశీయంగానూ బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 2,440 వద్ద కొనసాగుతోంది. మంగళవారం లండన్ మార్కెట్లో ఔన్స్ పసిడి 1.7 శాతం పెరిగి 2,464 డార్లకు చేరుకుంది. ఇది మేలో నమోదైన ఆల్‌టైమ్ హై 2,450 డాలర్లకు చేరువగా ఉన్నాయి. డాలర్ బలహీనపడటం, ట్రెజరీ రాబడులు క్షీణించడం వల్ల బంగారానికి డిమాండ్ పెరిగేందుకు కారణమని సిటీ ఇండెక్స్‌ నిపుణులు ఫవాద్ రజాక్‌జాదా చెప్పారు. మన మార్కెట్లలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత కొద్దిరోజులుగా రూ. 67 వేలకు అటూఇటూ కదలాడుతున్న ధరలు తాజాగా పెరిగాయి. 24 క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం మంగళవారం ఒక్కరోజే రూ. 380 పెరిగి రూ. 74,020గా ఉంది. రిటైల్ మార్కెట్లో పన్నులు కలుపుకుని 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ. 76,000కు పైనే ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 350 పెరిగి రూ. 67,850 వద్ద ఉంది. ఇక, వెండి సతైం గరిష్ట స్థాయిలోనే ఉంది. మంగళవారం కిలో వెండి రూ. 99,500 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి 30 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Advertisement

Next Story