‘గెలిచాక మళ్లీ కలుద్దాం’.. కేంద్ర మంత్రులకు ప్రధాని మోడీ సందేశం

by Hajipasha |
‘గెలిచాక మళ్లీ కలుద్దాం’.. కేంద్ర మంత్రులకు ప్రధాని మోడీ సందేశం
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘వెళ్ళండి.. గెలవండి.. నేను మిమ్మల్ని త్వరలోనే కలుస్తాను’’ అంటూ ఆదివారం జరిగిన కేంద్ర మంత్రిమండలి చివరి సమావేశంలో పాల్గొన్న మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్ఫూర్తిదాయక వీడ్కోలు పలికారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని కేంద్ర మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. ప్రస్తుతం బీజేపీ ఎదుట ఉన్న రాజకీయ సవాళ్ల గురించి వివరించారు. విజన్ డాక్యుమెంట్ ‘వికసిత్ భారత్ 2047’ ప్రాధాన్యం.. దానికి సంబంధించిన వచ్చే ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక గురించి ఈసందర్భంగా మంత్రులకు దాదాపు గంటపాటు ప్రధాని వివరించారు. ఈ అంశాన్నే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మోడీ పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ ప్రజలతో మమేకమయ్యే సమయంలో, వ్యాఖ్యలు చేసే సమయంలో ఆచితూచి వ్యవహరించాలని సూచించారు.‘‘వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండండి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించండి. డీప్‌ఫేక్‌ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించండి’’ అని మంత్రులను ప్రధాని కోరారు. జూన్‌లో సమర్పించనున్న పూర్తి బడ్జెట్‌లో ‘వికసిత్ భారత్’‌ ఎజెండాకు సంబంధించిన సంగ్రహావలోకనం కనిపిస్తుందని ఆకాంక్షించారు. మూడోసారీ అధికారంలోకి వస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ప్రధాని.. గెలిచిన తర్వాత మళ్లీ కలుద్దాం అని మంత్రులకు ధీమాగా చెప్పారు.

Advertisement

Next Story