రాజస్థాన్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్.. గోడ దూకి మరీ పట్టుకున్న స్క్వాడ్

by S Gopi |   ( Updated:2024-07-17 14:04:06.0  )
రాజస్థాన్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్.. గోడ దూకి మరీ పట్టుకున్న స్క్వాడ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల దేశవ్యాప్తంగా పరీక్షలు, పేపర్ లీకేజీ వ్యవహారాలు అతిపెద్ద చర్చనీయాంసంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజస్థాన్‌లో ఓపెన్ స్కూల్ పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలను విజిలెన్స్ స్క్వాడ్ చాకచక్యంగా బయటపెట్టింది. పరీక్షలు రాసే విద్యార్థుల కోసం టీచర్లే బోర్డుపై సమాధానాలు రాస్తూ పట్టుబడ్డారు. ఈ సంఘటన రాష్ట్రంలోని దేచూ తాలూకాలోని కొలు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓపెన్ స్కూల్ విధానంలో 10, 12వ తరగతుల విద్యార్థులకు రాజస్థాన్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జోధ్పూర్ సమీపంలో ఉన్న కొలు అనే గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విజిలెన్స్ స్క్వాడ్ సాధారణ చెకింగ్‌లో భాగంగానే ఈ స్కూల్‌కు కూడా వెళ్లారు. అయితే, స్కూల్ గేటుకు తాళాలు వేసి ఉండటం చూసిన స్క్వాడ్‌కు సందేహం కలిగింది. అనుమానంతో స్క్వాడ్ సిబ్బంది పాఠశాల గోడ దూకి లోనికి వెళ్లారు. తరగతి గదిలోకి వెళ్లి చూడగా, అక్కడ టీచర్లు సమాధానాలు బోర్డుపై రాస్తూ రెడ్-హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ వ్యవహారమంతా స్క్వాడ్ సిబ్బంది వీడియో రూపంలో రికార్డు చేశారు. విద్యార్థుల నుంచి డబ్బు తీసుకుని టీచర్లు మాస్ కాపీయింగ్‌కి పాల్పడిన ప్రాథమికంగా తెలిసింది. ఈ విషయంపై విచారించిన ఫ్లయింగ్ స్క్వాడ్ హెడ్ నిషి జైన్.. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 2,000, రూ. 2,100 మొత్తాల్లో టీచర్లు వసూలు చేశారని చెప్పారు. దీనికి సంబంధించి ప్రిన్సిపాల్ రాజేంద్ర సింగ్ చౌహాన్‌తో పాటు మరో 10 మంది టీచర్లపై కేసు నమోదు చేసినట్లు రాజస్థాన్ విద్యా శాఖ వెల్లడించింది.

Advertisement

Next Story