పద్మవిభూషణ్ అందుకున్న వైజయంతిమాల, చిరంజీవి

by Hajipasha |   ( Updated:2024-05-09 19:23:58.0  )
పద్మవిభూషణ్ అందుకున్న వైజయంతిమాల, చిరంజీవి
X

దిశ, నేషనల్ బ్యూరో : పద్మ అవార్డుల ప్రదానోత్సవం గురువారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా అట్టహాసంగా జరిగింది. మరికొందరు ప్రముఖులు రాష్ట్రపతి చేతులమీదుగా ‘పద్మ’ పురస్కారాలను అందుకున్నారు. 90 ఏళ్ల అలనాటి నటి వైజయంతిమాల బాలి, 68 ఏళ్ల తెలుగు స్టార్ కొణిదెల చిరంజీవి పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని స్వీకరించారు. సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి దివంగత ఎం ఫాతిమా బీవీ (మరణానంతరం), "బాంబే సమాచార్" వార్తాపత్రిక యజమాని హార్ముస్జీ ఎన్ కామా, బీజేపీ నాయకుడు ఓ.రాజగోపాల్, తమిళ నటుడు దివంగత కెప్టెన్ విజయకాంత్ (మరణానంతరం), లడఖ్ ఆధ్యాత్మిక నాయకుడు తొగ్డాన్ రింపోచెయ్ (మరణానంతరం), గుజరాతీ వార్తాపత్రిక ‘జన్మభూమి’ గ్రూప్ ఎడిటర్, సీఈవో కుందన్ వ్యాస్‌లను పద్మభూషణ్‌ వరించింది. ఫాతిమా బీవీ, విజయకాంత్, రింపోచెయ్ కుటుంబ సభ్యులు హాజరై అవార్డును అందుకున్నారు. పద్మభూషణ్ పొందిన వారిలో ప్రముఖ కార్డియాలజిస్ట్ అశ్విన్ బాలచంద్ మెహతా, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు దివంగత సత్యబ్రత ముఖర్జీ కూడా ఉన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలలో భారతదేశపు తొలి మహిళా ఏనుగు ముహావత్ పార్వతి బారుహ్ సైతం ఉన్నారు. ఈమెను అందరూ ‘హస్తి కన్యా’ అని పిలుస్తుంటారు. తెలంగాణ శిల్పి వేలు ఆనందాచారి, త్రిపురకు చెందిన చేనేత కళాకారుడు స్మృతి రేఖ చక్మా, అండమాన్ నికోబార్ దీవులలో సేంద్రీయ కొబ్బరి తోటల సాగుకు పేరుగాంచిన కె చెల్లమ్మాళ్, స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప కూడా పద్మశ్రీని అందుకున్నారు.

101 ఏళ్ల ఫ్రెంచ్ యోగా టీచర్‌..

చిన్నతనంలోనే రెండు చేతులు, కాళ్లు పోగొట్టుకున్న కర్ణాటకకు చెందిన దివ్యాంగుడు కెఎస్ రాజన్న పద్మశ్రీని అందుకోవడానికి వెళ్తుండగా కరతాళ ధ్వనులు మార్మోగాయి. పద్మశ్రీ అవార్డు గ్రహీత, పంజాబ్‌కు చెందిన ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్ ప్రాణ్ సబర్వాల్ అవార్డును అందుకునేందుకు వెళ్లే క్రమంలో ప్రధాని మోడీ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. షార్లెట్ చోపిన్ అనే 101 ఏళ్ల ఫ్రెంచ్ యోగా టీచర్‌ను పద్మశ్రీతో సత్కరించారు. ఆమె ఆకుపచ్చ చీర కట్టుకుని అవార్డును అందుకోవడానికి వేదికపైకి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు.

నాడు తొలి విడత.. ఇప్పుడు రెండో విడత ప్రదానం

ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజున దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం 132 పద్మ అవార్డులను ప్రకటించింది. వాటిలో ఐదు పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.ఏప్రిల్ 22న మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడితో పాటు పలువురికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలు అందించారు. ఆ రోజు పద్మ అవార్డుల మొదటి విడత పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు గురువారం రోజు రెండో విడత ప్రదానోత్సవం జరిగింది.

Advertisement

Next Story